గతంలో ఎన్నడూ లేనంత ప్రతిష్టాత్మకంగా పుష్కరాలను నిర్వహించాలనుకున్న చంద్రబాబుకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఎన్నో సమీక్షా సమావేశాలు, కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసిన ఏపీ సర్కారు.. హంగులు, ఆర్భాటలకుపోయే ప్రమాదాన్ని కొన్నితెచ్చి అమాయకుల ప్రాణాలను బలిగొందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ప్రమాదానికి సీఎం చంద్రబాబుతోపాటు సినీ డైరెక్టర్ బోయపాటి శీను కూడా కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
భారీగా సినిమాలు తీయడంలో బోయపాటికి ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇక పుష్కరాలపై ఓ డాక్యుమెంటరీ తీసి మీడియాకు విడుదల చేయాలనుకున్న చంద్రబాబుకు బోయపాటి మొదటగా గుర్తుకొచ్చారు. ఇక భారీసంఖ్యలో జనాలుంటే డాక్యుమెంటరీ అద్భుతంగా వస్తుందనుకున్న బోయపాటి గేటు అవతల వేల సంఖ్యలో జనాలు పోగయ్యేలా చూశారని, అంతేకాకుండా ఈ జనాలకు సమీపంలోనే చంద్రబాబు పుష్కర స్నానం చేసేలా ప్లాన్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే చంద్రబాబు వీఐపీ ఘాట్‌లో కాకుండా సాధారణ ఘాట్‌లో పుష్కర స్నానం చేశారని, డాక్యుమెంటరీ పనిలో ఆయన దాదాపు అక్కడ రెండు గంటలు గడిపారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ రెండు గంటలపాటు గేట్లకు అటువైపు వేల మంది మధ్య ఊపిరిసలపక ప్రజలు తీవ్ర అవస్థలుపడ్డారు. ఇక ఒక్కసారి గేట్లు ఓపెన్ చేయగానే జనసందోహం నుంచి ముందుకు కదిలి కాసింత ఊపిరైనా తీసుకోవచ్చని వారు భావించారు. ఇలా ఒకేసారి వేల మంది ముందుకు వెళ్లడానికి పోటీపడటంతో అక్కడ తొక్కిసలాట జరిగి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ డాక్కుమెంటరీ చిత్రీకరణ విషయం బయటకు రాకుండా ఆంధ్ర ప్రభుత్వం, టీడీపీ మీడియా జాగ్రత్తపడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. పుష్కరాల్లో ఇంతటి ప్రమాదం జరిగినా ఏ ఒక్కరిపై వేటు వేయకుండా న్యాయవిచారణకు ఆదేశించి చంద్రబాబు ప్రస్తుతానికి విషయాన్ని పక్క దారి పట్టించట్లే. ఇక న్యాయ విచారణ బృందం ప్రమాదానికి కారణాలను తేల్చే సమాయానికి ప్రమాద విషయమై జనాల్లో ఆగ్రహావేశాలు చల్లబడుతాయి. అప్పుడు ఇద్దరు, ముగ్గురు సాధారణ అధికారులను సస్పెండ్ చేసి ప్రభుత్వం తప్పించుకోవచ్చనే ఈ వ్యూహాన్ని అమలు చేసినట్లు విపక్షాలు విమర్శిస్తున్నాయి.