2014 ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వరకు కూడా టీడీపీ గెలిచే అవకాశాలపై ఆంధ్రప్రదేవ్ అంతటా అనుమానాలున్నాయి. అలాంటిది స్పష్టమైన మెజార్టీతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. దీనికి వైసీపీ పార్టీ చేసిన అనేక తప్పిదాలతోపాటు.. పవన్ కల్యాణ్ ప్రచారం కూడా టీడీపీకి కలిసొచ్చిందన్న వాదనలు ఉన్నాయి. దీన్ని అందరూ మరిచిన చంద్రబాబు మాత్రం గుర్తుపెట్టుకొన్నారు. అందుకే టీడీపీ నాయకులెవరైనా పవన్‌ను విమర్శిస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు.
టీడీపీ ఎంపీలతో జరిగిన సమావేశంలో పవన్ కల్యాన్ విమర్శల విషయం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. టీడీపీకి మిత్రపక్షమంటూనే పవన్ తెలుగుదేశం ఎంపీలపై తీవ్ర విమర్శలు చేయడాన్ని ఎంపీలు తప్పుపట్టినట్లు సమాచారం. అయితే ఆ విమర్శల సంగతిని పక్కన పెట్టాలని, రాజకీయాల్లో విమర్శలు చేసే వారు చేస్తూనే ఉంటారని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అంతేకాకుండా టీడీపీ ఎంపీలెవరు కూడా పవన్ విమర్శించవద్దని స్పష్టం చేసినట్లు తెలిసింది. అందులో భాగంగానే ఆ సమావేశం తర్వాత కేంద్రమంత్రి సుజనాచౌదరి మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌కల్యాణ్‌తో తమకు ఎలాంటి విబేధాలు లేవని, ఆయన సూచనలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. పవన్ కల్యాణ్ పుణ్యమా అని కనీసం ఈసారైనా పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాలను మన ఎంపీలు గట్టిగా నిలదీస్తారని తెలుగు ప్రజలు ఆశిస్తున్నారు. ఈ మేరకు అటు వైసీపీ ఇటు టీడీపీ ఎంపీలు కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.