జూలై 19న ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రెండు ప్యానల్స్ కు చెందిన వారు పోటీ పడుతున్నారు. నట్టికుమార్, ప్రసన్న కుమార్ లు ఒక ప్యానల్ కాగా సురేష్ బాబు అండ్ కో మరొక ప్యానెల్. ఈ సందర్భంగా నట్టికుమార్ హైదరాబాద్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో..
నట్టి కుమార్ మాట్లాడుతూ "ఫిలిం ఛాంబర్ ని అడ్డాగా పెట్టుకొని, సినీ కళామతల్లిని అడ్డంగా శిరచ్చేద్ధం చేస్తున 'మోనోపలి' దళారి తలారులను ఓటు అనే ఆయుధంతో తరిమి కొట్టాలి. మొదటిసారిగా ఛాంబర్ కు చెందిన ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, స్టూడియో సెక్టార్ అనే నాలుగు ప్యానల్స్ లో పోటీ చేస్తున్నాం. సురేష్ బాబు టీం కు వ్యతిరేకంగా మేము పోటీలో నిలబడ్డాం. ఈరోజు నిర్మాతలు సినిమాలు తీసిన డిస్ట్రిబ్యూటర్స్ ఆ చిత్రాలను రిలీజ్ చేసే పరిస్థితుల్లో లేరు. 20 సంవత్సరాల ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎగ్జిబిటర్స్ కు ఎన్నికలనేవే జరగలేదు. మొదటిసారిగా ఈ ఎలక్షన్స్ తో ప్రారంభం కానున్నాయి. సురేష్ బాబు టీం లో అసలు ఎగ్జిబిటర్స్ కు సంబంధించిన ప్యానల్ కూడా లేదు. డిస్ట్రిబ్యూటర్స్ ప్యానల్ లో మాకు 12 మంది ఉంటే వారి టీం కు మాత్రం పది మందే ఉన్నారు. స్టూడియో సెక్టార్ ప్యానల్ మాకు నలుగురుంటే వారికి ఇద్దరు మాత్రమే ఉన్నారు. సురేష్ బాబు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వారు చేసిన తప్పులకు ఛాంబర్ ద్వారా ఫైన్ చెల్లించారు. ఛాంబర్ ను వారి సొంత పనులకు వినియోగించుకున్నారు. వాళ్ళ సొంత లాభం కోసం, స్వార్ధం కోసం ఛాంబరు అనే సంస్థను వ్యాపార అడ్డాగా మార్చుకున్నారు. ఇప్పుడు వంద దొంగ ఐడి లను సృష్టించి ఎలక్షన్స్ లో ఓటు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. దానిని ఆపాలని ఎలక్షన్ ఆఫీసర్స్ కు పిర్యాదు చేసాం. కాని వారు రెస్పాండ్ అవ్వడం లేదు. నామినేషన్స్ సరిగ్గా తీసుకోవడంలేదు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలో డిస్ట్రిబ్యూటర్స్ వ్యవస్థను అణచివేసిన వీళ్ళకు ఓటు వేస్తారా.. ఒకసారి ఆలోచించుకోండి. ప్రొడ్యూసర్స్ కు, డిస్ట్రిబ్యూటర్స్ కు మంచి రోజులు రావడం కోసం మా ప్యానల్ ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను" అని చెప్పారు.