రాజమండ్రి పుష్కర ఘాట్‌లో చోటుచేసుకున్న మహావిషాదం తెలుగు ప్రజల గుండెల్ని కలిచి వేసింది. పుష్కరాల్లో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా అన్ని ఏర్పాట్లు చేసినా మొదటి రోజే తొక్కిసలాటలో 27 మంది ప్రాణాలో కోల్పోవడం అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజలను కూడా తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఇక సంఘటన జరిగిన గంటల వ్యవధిలోనే ప్రతిఒక్కరూ ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇక సినీ హీరో పవన్‌కల్యాణ్ కూడా పుష్కరఘాట్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. బాధితులను ప్రత్యక్షంగా పరామర్శించి.. సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని ఉన్నా.. ప్రభుత్వ సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందనే తాను అక్కడికి వెళ్లడం లేదని చెప్పారు. ఇక జనసేన కార్యకర్తలు, అభిమానులు కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.