'మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ సౌత్ ఆరవ ఏడాదిలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. 2014లో విడుదలైన 197 సినిమాలలో పాటలు లేని చిత్రాలను మినహాయించి 176తెలుగు చిత్రాల్లోంచి 947 గీతాలను పరిశీలించి వివిధ విభాగాల వారిగా అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన సంగీతకారులను మిర్చి మ్యూజిక్ అవార్డ్స్‌తో సత్కరించనున్నాం’ అని అన్నారు తెలుగు విభాగ మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ జ్యూరీ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు. రేడియో మిర్చి మ్యూజిక్ అవార్స్‌డ సౌత్ 2014 వేడుక ఈ నెల 22న హైదరాబాద్‌లో జరగనుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలకు చెందిన ప్రతిభావంతులైన కళాకారులకు ఈ అవార్డులు అందజేయనున్నారు. ఈ నాలుగు భాషలకు చెందిన సినీ సంగీతకారులతో పాటు ప్రముఖ నటీనటులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. జీవన సాఫల్య పురస్కారంతో పాటు 14 విభాగాల్లో ఈ అవార్డులను అందజేస్తారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో తెలుగు జ్యూరీ సభ్యులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సురేష్‌బాబు మాట్లాడుతూ ‘రాజకీయాలకు అతీతంగా విభేదాలకు తావు లేకుండా పూర్తి నిష్ఫక్షపాతంగా ఈ అవార్డుల ఎంపిక జరుగుతుంది. 2014 సంవత్సరానికిగాను ప్రముఖ గాయని ఎస్.జానకి గారిని జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించనున్నాం. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.పి.కోదండపాణి తనయుడు ఎస్.పి. ఈశ్వర్‌కు ప్రత్యేక జ్యూరీ అవార్డును అందజేయనున్నాం’ అన్నారు. ప్రతిభావంతులైన సంగీత దర్శకులను విజేతలుగా నిర్ణయించే అవకాశం మాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను తనికెళ్లభరణి చెప్పారు. ‘దక్షిణాది భాషల్లో ఎన్నో అజరామరమైన గీతాల్ని ఆలపించిన జానకమ్మను జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించడం మిర్చి మ్యూజిక్ అవార్డ్స్‌కు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. ఈ అవార్డుల వేడుక మరో మెట్టు ఎదిగినట్లు ఉంది’ అని ఆర్.పి.పట్నాయక్ చెప్పారు. చంద్రబోస్ మాట్లాడుతూ ‘గేయరచయితలు రాసిన పాటలకు ప్రచారాన్ని కల్పించడంతో పాటు వారి ప్రతిభకు పురస్కారాలు ప్రదానం చేయడం సంతోషదాయకం. మరిన్ని మంచి గీతాల్ని రాయడానికి ఈ అవార్డుల ప్రోత్సహన్నిస్తాయి.’ అని పేర్కొన్నారు. మ్యూజిక్ అవార్డ్స్ నూతన సంగీతకారులు ఎదిగేందుకు తోడ్పటునందిస్తాయని, గాయనిగా నాకు స్ఫూరిగా నిలిచిన జానకి గారికి జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేయడం ఆనందంగా ఉందని కౌసల్య చెప్పారు. ఈ కార్యక్రమంలో జ్యూరీ సభ్యులు చంద్రసిద్దార్థ, అబ్బూరి రవి, రామజోగయ్యశాస్త్రి, మోహనకృష్ణ ఇంద్రగంటి, మధుర శ్రీధర్ పాల్గొన్నారు.