దాదాపు నాలుగు రోజులుగా పవన్ ఏం మాట్లాడుతారోనని యావత్ తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే వారి అంచనాలకు తగ్గకుండా పవన్ మాట్లాడారు.. కాని సమస్య ఏమిటంటే అది ఎవరికీ అర్థం కాలేదు. ప్రస్తుతం రెండు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చాలా స్పష్టతతో పవన్ ప్రెస్‌మీట్‌కు వచ్చారు. అయితే మీడియా ప్రతినిధులకు, ప్రజలకు మాత్రమే ఆయన చెప్పిన అంశాలపై స్పష్టత కరువైంది. ఇక పవన్ ప్రసంగం విషయానికొస్తే..
పవన్ ప్రెస్‌మీట్ ప్రధాన ఎజెండా ఓటుకు నోటు కేసు. ఈ కేసుకు సంబంధించి టీడీపీ చేసింది తప్పా..? ఒప్పా..? అనే విషయాన్ని వపన్ స్పష్టం చేయాల్సి ఉండే. అయితే పవన్ ఈ విషయంపై నేరుగా స్పందించలేదు. రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయంటూ వ్యాఖ్యానించారు అంతే. రేవంత్‌రెడ్డి వ్యవహారం కోర్టులో ఉందని, దాని గురించి వ్యాఖ్యానించలేనన్నారు. మరి అలాంటప్పుడు ప్రెస్‌మీట్ ఎందుకు పెట్టారు. పోనీ.. కోర్టులో ఉన్న విషయంపై మాట్లాడటం భావ్యం కాదని పవన్ భావించాడనుకుందాం. మరీ ఏపీ సీఎమ్ ఫోన్ ట్యాపింగ్ చేయడం ఘోరమైన చర్య అంటూ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది ఇంకా రుజువే కాలేదు. దీనిపై కోర్టులో పిటీషన్ కూడా దాఖలు కాలేదు. మరి వపన్ ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వానిది తప్పని ఎలా తేల్చాశారో అర్థం కాలేదు. లేకపోతే పవన్ ఏపీ సర్కారుకు మద్దతుగా కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడారనుకుందాం. ఇక్కడా పవన్ ప్రజల్ని కన్‌ఫ్యూజ్ చేయకుండా వదిలిపెట్టలేదు. హైదరాబాద్‌లో సెక్షన్-8 అమలుకాకుండా కేసీఆర్ ఆదుకోవాలన్నట్లు మాట్లాడారు. ఇప్పుడు కేసీఆర్ చర్యలతోనే సెక్షన్-8 డిమాండ్ రాగా.. ఇప్పుడు ఆయన్నే పవన్ శరణుజొచ్చారు. పనిలోపనిగా సీమాంధ్ర ఎంపీలను పవన్ పేరుపేరునా కడిగి పారేశారు. ఏపీకి సాయం విషయంలో ఈ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యారని చెప్పారు. దీనికి ఎంపీలకంటే కూడా పవనే అధిక బాధ్యత వహించాల్సి ఉంటుంది. బీజేపీకి మద్దతుగా అనేక సభల్లో ప్రచారం చేసిన పవన్ ఆ తర్వాత మోడీని ఏపీకి సాయం విషయమై ఎందుకు కలవలేదనే విషయంలో స్పష్టత కరువైంది. ఇక మీడియాకు స్వేచ్ఛ నివ్వాలంటూ పవన్ సూక్తులు పలికారు. మరి డీసీ ఆఫీస్ ముందు తన మంది మర్బాలంతో పదేళ్ల కిందట పవన్ చేసిన రచ్చను ఆయనంత ఈజీగా ప్రజలు మరిచిపోలేరన్నది సుస్పష్టం. ఇక చివరకు మీడియాకు ప్రశ్నలు అడిగే అవకాశం కూడా ఇవ్వకుండా గందరగోళం మధ్య సభను ముగించి పవన్ జారుకున్నట్లు కనిపిస్తోంది. ఇంతదానికి మరి ప్రెస్‌మీట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందనేది అర్థంకాకుండా ఉంది. మొత్తనికి పవన్ ప్రెస్‌మీట్.. 'నువ్వుస్తానంటే నేనుద్దనంటానా'లో సునీల్ డైలాగును గుర్తుకుతెచ్చింది. ఏం చెప్పావురా అంటే.. అది బాగా చెప్పాడనే.. లేక ఏం చెప్పాడో అర్థం కాలేదనా..? అనేది మాత్రం జనాలకు అర్థమైనట్లుంది.