ప్రస్తుతం నోటుకు ఓటు కేసులో టీడీపీ, టీఆర్‌ఎస్‌ల మధ్య ఆరోపణల పర్వం నడుస్తోంది. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్ కొనుగోలు చేయడానికి యత్నిస్తుందని, అప్పుడ వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని టీడీపీ ఎత్తులు వేస్తున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. మరోవైపు రేవంత్‌పై కేసు పుణ్యమా అని ఇతర పార్టీల నాయకులపై ఉన్న కేసులో కూడా చర్చకు వస్తున్నాయి. తాజాగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై ఏకంగా యూఏఈలో కేసు నమోదైనట్లు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వారి ఆరోపణల ప్రకారం..
జీవన్‌రెడ్డి యూఏఈలోని ఓ బ్యాంకు వద్ద అప్పు చేసి ఎగొట్టి దేశానికి వచ్చాడని, దీనికి సంబంధించి షార్జాలో కేసు కూడా నమోదైనట్లు టీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించిన విషయాలను జీవన్‌రెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనలేదని, ఎప్పటికైనా ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని నరిసిరెడ్డి పేర్కొన్నారు. అంతేకాకుండా జీవన్‌రెడ్డి చీటర్‌కు తక్కువ, బ్రోకర్‌కు ఎక్కువ అంటూ విమర్శించారు. మరి ఈ ఆరోపణల్లోని వాస్తవాలను వెలికి తీయడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం చర్యలు చేపడుతుందా లేదా అన్నది వేచిచూడాలి.