వికీలిక్స్‌తో అమెరికాను ఓ కుదుపు కుదుపేసిన అసాంజేలా మన వద్ద లలిత్ మోడీ రోజకో లీక్‌నిస్తూ అటు ప్రభుత్వాన్ని.. ఇటు ప్రతిపక్షాన్ని కూడా ఇరుకునపడేస్తున్నాడు. మొదట బీజేపీ నాయకులే టార్గెట్‌గా సాగిన మోడీ లీకులు ఆ తర్వాత కాంగ్రెస్‌వైపు మరలాయి. తాను లండన్‌లో ప్రియాంకగాంధీ, రాబర్ట్‌వాద్రాలను కలుసుకున్నానని చెప్పగానే కాంగ్రెస్ అధిష్టానానికి కూడా చెమటలు పట్టాయి. అంతవరకు ఓ నేరస్తుడికి ఎందుకు సాయం చేశారంటూ విరుచుకుపడిన కాంగ్రెస్ నాయకులు దీంతో పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయారు. కావాలనే లలిత్ మోడీతో బీజేపీ కుమ్మక్కై తమపై ఆరోపణలు చేయిస్తుందంటూ తప్పించుకోవడానికి చూశారు. అయితే ఇప్పుడు ఏకంగా ఆ పార్టీ అధినేత్రి సోనియానే లలిత్ మోడీ టార్గెట్ చేశారు.
తాను చేస్తున్న ప్రతి ఆరోపణకు తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయంటూ లలిత్ మోడీ ప్రకటిస్తుండటం ఇప్పుడు రాజకీయవర్గాల్లో కలకలం రేగుతోంది. ఇప్పటికే లలిత్ మోడీ ఆరోపణలతో పలు వాస్తవాలు బయటకు వచ్చి రాజస్తాన్ సీఎం వసుంధర రాజే పదవి ఉంటుందో ఊడుతుందో తెలియని గందరగోళం నెలకొంది. ఇక తాజాగా ఆయన సోనియా గాంధీపై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై నమోదైన కేసుల నుంచి తప్పించుకోవడానికి సోనియా రూ. 380 కోట్లు డిమాండ్ చేశారని, ఈ మేరకు బీజేపీ నాయకుడు వరుణ్‌గాంధీ తనతో బేరసారాలు సాగించినట్లు తెలిపాడు. యథావిధిగా ఈ ఆరోపణలను అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ నాయకులు కూడా ఖండించారు. ఇక తాము ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటే లాభం లేదని నిర్ణయానికి వచ్చిన ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా లలిత్‌మోడీ వ్యవహారాన్ని పక్క దారి పట్టించడానికి ప్రయత్నాలు ఆరంభించారు. అందుకే ప్రస్తుతం విదేశాల్లో దాగి ఉన్న మోడీ పని పట్టడానికి ఈడీని రంగంలోకి దించారు. ప్రస్తుతం లలిత్‌పై నమోదైన కేసులకు సంబంధించి ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఇక అధికార, ప్రతిపక్షాలు కూడా లలిత్ వ్యవహారంలో చిక్కుకుపోవడంతో పార్లమెంట్‌లో దీనిపై పెద్ద దుమారం రేగుతుందని ఆశించడానికి అవకాశాలు లేవు. ఇక ప్రాంతీయ పార్టీలు పట్టుబడితే తప్పా లలిత్ వ్యవహారం పార్లమెంట్‌లో చర్చకు వచ్చే సూచనలు కనబడటం లేదు.