ప్రతి ఏటా అమెరికాలో నిర్వహించే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) మహాసభలకు ఈ సంవత్సరం డెట్రాయిట్ వేదికగా మారింది. కోబో సెంటర్‌లో ఎంతో వైభవంగా జరగనున్న ఈ సభలకు సంబంధించిన పనులు వేగవంతమయ్యాయి. జూలై 2, 3, 4 తేదీల్లో కోబో సెంటర్, డెట్రాయిట్‌లో జరిగే ఈ సభలకు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలతోపాటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా తెలుగువారు హాజరవుతున్నారు. ఈ సభలకు హాజరయ్యే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు తానా సభ్యులు. దాదాపు 12 వేల మంది కూర్చొనే అవకాశం వున్న కోబో సెంటర్‌లో మరి కొంతమందికి కూడా ఈ ఉత్సవాలను వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. అంతేకాకుండా 6 వేల మంది ఒకేసారి కూర్చొని భోజనం చేసే అవకాశం కోబో సెంటర్‌లో వుంది. ప్రపంచ వ్యాప్తంగా హాజరయ్యే తెలుగువారి కోసం అచ్చమైన తెలుగు వంటకాలను సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. రాజుగారి బిరాన్యి, నాటు కోడి పులుసు, చేపల పులుసు, ఉలవచారు, బిర్యాని, గోంగూర పచ్చడి.. ఇలా 15 రకాల వంటకాలను సిద్ధం చేస్తున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ సభల్లో పాల్గొనేవారికి సౌకర్యంగా వుండే తానా బజార్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ తానా బజార్‌లో చిన్న వస్తువుల నుంచి బంగారు ఆభరణాల వరకు అన్నీ అందుబాటులో వుంచుతున్నారు. ప్రతి ఏటా తానా సభలు జరుగుతున్నప్పటికీ ఈ 20వ తానా సభల్ని మాత్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు తానా సభ్యులు ఉత్సాహం చూపిస్తున్నారు.