శ్రీశివపార్వతి కంబైన్స్ పతాకంపై కృష్ణుడు హీరోగా ‘నాకూ ఓ లవరుంది’ వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను నిర్మించిన యువ నిర్మాత కె.సురేష్‌బాబు ఆ చిత్రం తర్వాత ఫ్లోరైడ్ సమస్యని నేపథ్యంగా తీసుకొని యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా ‘దక్షిణ మధ్య భారత జట్టు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిన్న నిర్మాతలకు చేదోడు వాదోడుగా వుంటూ వారికి ఎలాంటి సమస్యలు వున్నా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్న సురేష్‌బాబు సేవలను గుర్తించిన ఎ.పి. ఫిలింఛాంబర్ అతనికి పలు బాధ్యతలను అప్పగించింది. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్టార్ మెంబర్‌గా, బైలా అండ్ టాక్సైజేషన్ సబ్ కమిటీ మెంబర్‌గా, ఎ.పి. ఫిలిం ఛాంబర్ మ్యాగజైన్ సబ్ కమిటీ మెంబర్‌గా ప్రస్తుతం ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా వుండగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) సభలకు సురేష్‌బాబు ఆహ్వానం అందుకున్నారు. 2015 జూలై 2, 3, 4 తేదీల్లో కోబో సెంటర్, డెట్రాయిట్‌లో జరిగే తానా సభలకు హాజరు కావాల్సిందిగా నిర్మాత కె.సురేష్‌బాబుకి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ఆహ్వానం పంపింది.
‘తానా’ ఆహ్వానం అందుకున్న యువ నిర్మాత కె.సురేష్‌బాబు మాట్లాడుతూ ‘‘నాకూ ఓ లవరుంది’ చిత్రంతో నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయమైన నాకు ఆ చిత్ర నిర్మాణంలోనే చిన్న నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి కష్టనష్టాలు నాకు అర్థమయ్యాయి. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే నిర్మాతలకు నావంతు సాయం చేయడం నా కర్తవ్యంగా భావించాను. ఎవరికి ఎలాంటి సమస్య ఎదురైనా దాని పరిష్కరించే దిశగా నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. నా సేవలను గుర్తించిన ‘తానా’ నన్ను డెట్రాయిట్‌కు ఆహ్వానించడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఫిలిం ఛాంబర్‌లో నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇకముందు కూడా చిన్న నిర్మాతలకు అండగా వుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను’’ అన్నారు.