యూపీఏ హయాంలో చోటుచేసుకున్న కుంభకోణాల్లో బొగ్గు స్కాం ప్రధానమైనది. ఈ కేసుకు సంబంధించి దాసరి నారాయణరావు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ స్కాం చోటుచేసుకున్న సమయంలో బొగ్గుశాఖ సహాయమంత్రిగా పనిచేసిన దాసరి జిందాల్ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించారని సీబీఐ ఆరోపిస్తోంది. జార్ఖండ్‌లోని అమరకొండ ముర్గా దుంగల్ బొగ్గు క్షేత్రాల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మధుకోడా, దాసరిసహా మొత్తం 14 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది.
ఇక మంగళవారం ఈ కేసుకు విచారణకు సంబంధించి దాసరి మంగళవారం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అప్పట్లో తాను బొగ్గుశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పటికీ నిర్ణయాలన్నీ మాజీ ప్రధాని మన్‌మోహన్‌సింగే తీసుకునే వారని పేర్కొన్నారు. ఆ శాఖ అప్పటి ప్రధాని మన్‌మోహన్‌సింగ్ తన వద్దే ఉంచుకున్నాడని, ఆయన సూచనల మేరకే తాము నడుచుకున్నామని చెప్పాడు. దీన్నిబట్టి బొగ్గు కేటాయింపుల్లో ఏవైనా అవకతవకలు జరిగితే వాటికి మన్‌మోహన్‌సింగే కారణమని దాసరి స్పష్టంగా సెలవిచ్చినట్లే. మరి పొలిటికల్ కెరియర్‌లో అవినీతి మచ్చ అంటుకోని నాయకుడిగా చెలామణి అవుతున్న మన్‌మోహన్ సింగ్ ఇప్పుడు దాసరి వ్యాఖ్యలతో చిక్కుల్లో పడినట్లే.