ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డికి బెయిల్ మంజూరైంది. ముప్పై రోజులపాటు జైలు జీవితం గడిపిన రేవంత్‌రెడ్డి ఎట్టకేలకు బయటకు రానున్నాడు. అయితే రేవంత్‌రెడ్డి బెయిల్‌పై తెలంగాణ ఏజీ చేసిన వాదనలను కోర్టు పట్టించుకోలేదు. రూ. 5 కోట్లకు సంబంధించి ఈ డీల్‌లో మిగిలిన రూ. 4.50 కోట్ల గురించి తేలాల్సి ఉందని, అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి మరో ముద్దాయి మత్తయ్య పరారీలో ఉన్నందునా రేవంత్‌కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని కూడా ఏజీ వాదించారు. అయితే ఈ వాదనలను తోసిపుచ్చిన న్యాయమూర్తి రేవంత్‌కు బెయిల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.
రేవంత్‌కు బెయిల్ ఇవ్వడానికి కోర్టు పలు కండీషన్లు పెట్టింది. బెయిల్ కోసం రూ. 5 లక్షల పూచికత్తు సమర్పించాల్సి ఉంటుందని, పాస్‌పోర్టు సరేండర్ చేయాలని, కోడంగల్, హైదరాబాద్‌లో మాత్రమే ఉండాలని, బయటకు వెళ్లవద్దని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఇక ఇదే కేసులో అరెస్టు అయిన ఇతర నిందితులు సెబాస్టియన్, ఉదయ్‌సింహాలకు కూడా కోర్టు బెయిల్ మంజూరుచేసింది.