రెండు రాష్ట్రాల నడుమ యుద్ధానికి దారి తీసిన ఓటుకు నోటు కేసుపై స్పందించడానికి నెలకుగానీ పవన్‌కు తీరిక దొరకలేదు. అందునా ఆయన స్పందించిన తీరు.. చాలా హాస్యాస్పదంగా ఉంది. దక్షిణాఫ్రికా రాజకీయాలను తెలుగు రాజకీయాలతో పోల్చుతూ.. టీడీపీకి ఆయన బహిరంగంగానే మద్దతు పలికారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాజీమార్గమే రెండు రాష్ట్రాల ప్రజల భవిష్యత్తుకు రాజమార్గం కావడంతో పవన్ స్పందనపై విమర్శలు పెద్దగా వినిపించలేదు.
అయితే పవన్ ఓటుకు నోటు అంశంపై పదాల రూపంలో చిన్న ట్వీట్ చేసి తప్పించుకోవడం మాత్రం ఆయన అభిమానులను నిరాశపరిచింది. బహిరంగంగా రాజకీయ అంశాలపై ఆయన స్పందించి చాలాకాలం కావడంతో.. ఓటుకు నోటు కేసుపై ఆయన ఎవరి దుమ్ము దులిపేస్తారోననే ఆశగా ఎదురుచూసిన ప్రజలు పవన్ ట్వీట్ చేసి కాస్త నిరాశపడ్డారు. ఇక ఈ అంశమే కాకుండా.. పవన్ స్పందించాల్సిన చాలా అంశాల బకాయిపడ్డాయి. రాజధాని భూ సేకరణ, స్పెషల్ స్టేటస్, కేంద్ర ఆర్థిక మద్దతు, చంద్రబాబు హామీలు తదితర అంశాలపై కూడా ఆయన స్పందించాల్సి ఉంది. ఈ ఆంశాలపై స్పందించాలని చాన్నాళ్లుగా అటు రాజకీయవేత్తలు.. ఇటు అభిమానులు కూడా పవన్‌ను డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆలస్యం చేసి లాభం లేదనుకున్న పవన్ మొత్తం 8 అంశాలపై బహిరంగంగా మాట్లాడునున్నట్లు ప్రకటించారు. ఇక 8 అంశాల్లో కేసీఆర్, చంద్రబాబు, మోడీ తప్పక ఉంటారన్నది కచ్చితంగా చెప్పవచ్చు. అయితే విధానపరమైన తప్పిదాలు చేస్తున్న తన మిత్రపక్ష నాయకులను కూడా పవన్ ఏమాత్రం భయపడకుండా నిలదీస్తారా అనేది ఇప్పుడు ప్రజల్లో ఉన్న అనుమానం.