తెలంగాణా సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వ కార్డుల పంపణీ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాయిని నర్సింహారెడ్డి సభ్యులకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా..
హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ "తెలంగాణా ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకం కాదు. కెసిఆర్ గారు అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల శక్తి సామర్ధ్యాలున్న ముఖ్యమంత్రి. హైదరాబాద్ ను విశ్వకేంద్రంగా తీర్చిదిద్దే సంకల్పంతో ఉన్నారు. మరో రెండు సంవత్సరాల్లో హైదరాబాద్ ను అమెరికాలోని డల్లాస్ స్థాయిలో తీర్చిదిద్దనున్నాం. తెలంగాణాలో ప్రతిభావంతులైన కళాకారులెందరో ఉన్నారు. మంచి సినిమాలు చేయగలిగే సత్తా వారిలో ఉంది. వారి ఎదుగుదలకు తెలంగాణా సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్ తోడ్పడాలి. అందరిని కలుపుకుపోయి మంచి సినిమాలు చేయాలి. బంగారు తెలంగాణాలో అందరు భాగస్వాములు కావాలి. సినిమా కళాకారులు దాని కోసం సహకారం అందించాలి. ఎన్నో త్యాగాల ఫలితంగా వచ్చిన ఈ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు తోడ్పాటునందించాలి" అని చెప్పారు.
అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ "ఈ అసోసియేషన్ లో ఇప్పటివరకు రెండువందల మంది సభ్యులుగా ఉన్నారు. త్వరలోనే ఈ అసోసియేషన్ తరపున తెలంగాణా కళాకారులతో ఓ సినిమా చేయనున్నాం" అని చెప్పారు.
సమాఖ్యధ్యక్షుడు సంగకుమార్ మాట్లాడుతూ "ఆకాష్, పూనమ్ కౌర్ జంటగా సానాయాదిరెడ్డి దర్శకత్వంలో తెలంగాణా సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓ చిత్రాన్ని రూపొందించనున్నాం. తెలంగాణా అస్తిత్వం, చరిత్ర, కళల విశిష్టతను ఆవిహ్కరిస్తూ పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూర్తిగా తెలంగాణా కళాకారులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నాం" అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో హీరో ఆకాష్, పూనమ్ కౌర్, సంపత్ కుమార్, ఉమాదేవి, జె.ఎల్.శ్రీనివాస్, మాణిక్ తదితరులు పాల్గొన్నారు.