ఓటుకు నోటు కేసులో టీడీపీ ఇరుక్కున నాటినుంచి ఫోన్‌లో అంతర్గత విషయాలను మాట్లాడటానికి నాయకులు జంకుతున్నారు. తాము ఏది మాట్లాడితే.. ఎక్కడ ట్యాపింగ్ అవుతుందోనని వారు ముఖాముఖి వ్యవహారాలకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఇక చంద్రబాబును పక్కనపెడితే మరో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ ట్యాపింగ్ వ్యవహారంలో చిక్కుకున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్‌కు సంబంధించి విడుదలైన ఆడియో ఆ రాష్ట్రంలో ప్రకపంనలు సృష్టిస్తోంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గరోత్ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే మృతిచెందారు. ఆ సీటులో జరుగుతున్న ఉప ఎన్నికల్లో పోటీచేయడానికి ఆపార్టీనుంచి అనేకమంది పోటీపడ్డారు. వారిలో రాజేష్‌చౌదరి అనే వ్యక్తి కూడా ఈ సీటు కోసం తీవ్రంగా పోటీపడ్డారు. అయితే ఆయన్ను బుజ్జగించడానికి రంగంలోకి దిగిన శివరాజ్‌సింగ్ ఇప్పటికి టికెట్ వదులుకుంటే భవిష్యత్తులో ఆయన కులానికి మంచి పదవినిస్తానంటూ ఆఫర్ ఇచ్చారు. అయితే ఈ బుజ్జగింపుల ఆడియోసీడీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల చేతిలోకి వచ్చింది. దీన్ని బయటపెట్టిన కాంగ్రెస్ శివరాజ్‌పై తీవ్ర విమర్శలకు దిగారు. అయితే తాను మాట్లాడింది ఎవరు రికార్డ్ చేశారన్నది ఇప్పుడు శివరాజ్‌సింగ్‌కు అంతుపట్టకుండా ఉంది.