మోడీ అధికారంలోకి వచ్చిన ఏడాది సమయంలో లలిత్ మోడీ అంశం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అవినీతి రహిత ప్రభుత్వమని డంకా మోగిస్తున్న మోడీ సర్కారులోని ఓ మంత్రి రెడ్ కార్నర్ నోటీసు ఉన్న వ్యక్తికి ఎందుకు సాయం చేశారని విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అయితే సాయం పొందిన లలిత్ మోడీయే రోజుకో విషయాన్ని లీక్ చేస్తూ బీజేపీని ఇరుకున పెడుతుండటం ఇప్పుడు ఎవరికీ అర్థం కాకుండా ఉంది.
ఏడేళ్ల క్రితం ఐపీఎల్ ప్రారంభ సమయంలో లలిత్‌మోడీకి ఎక్కడ లేని ప్రాధాన్యత దక్కింది. ఐపీఎల్ అనేది బీసీసీఐ స్పాన్సర్డ్ టోర్నీ అయినప్పటికీ లలిత్ అన్ని తానై వ్యవహరించాడు. ఆ సమయంలో ఆయనకు ఏ క్రికెటర్‌కూ తగ్గని స్థాయిలో ప్రచారం లభించేది. ఆ తర్వాత స్కాంలో ఇరుక్కున లలిత్‌న్ బీసీసీఐ పక్కకు పెట్టేసింది. ఇక భారత ప్రభుత్వం కూడా ఆయనపై రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన ప్రతిష్ట పూర్తిగా మసకబారిపోయింది. ప్రజలు కూడా ఆయన్ను మరిచిపోయారు.
మళ్లీ కేంద్ర మంత్రి సాయంతో ఆయనకు లండన్‌లో వీసా దొరికిందన్న వార్తతో లలిత్‌మోడీ ప్రచారంలోకి వచ్చారు. అప్పటినుంచే ఆయనే తనతో సంబంధ వ్యవహారాలు నడిపించిన ఒక్కొక్కరి పేర్లు బయటపెడుతూ కావాల్సినంత పబ్లిసిటీని పొందుతున్నాడు. రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుందరరాజే పేరు బయటకు రావడం కూడా ఇందులో భాగమే. తాజాగా కాంగ్రెస్‌ను టార్గెట్ చేసిన లలిత్ మోడీ తాను గతేడాది రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, రాబర్ట్ వాద్రాలతో కూడా సమావేశమైనట్లు ప్రకటించాడు. దీంతో ఆర్థిక నేరస్తుడికి కొమ్ముకాశారంటూ బీజేపీపై ఫైరయిన కాంగ్రెస్ ఇప్పుడు డిఫెన్స్‌లో పడింది. ఇక భవిష్యత్తులో లలిత్‌మోడీ ఈ వ్యవహారాన్ని మరెన్ని మలుపులు తిప్పుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.