గోవా ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ పారికర్‌ను తీసుకొచ్చి నరేంద్రమోడీ రక్షణమంత్రి పదవిలో కూర్చోబెట్టారు. ఆయన నిజాయతీ, సామర్థ్యంపై నమ్మకంతో పారికర్ మాత్రమే రక్షణ మంత్రి పదవికి న్యాయం చేయగలరని మోడీ పదవి అప్పగించారు. అయితే ఇటీవలే పారికర్ చేస్తున్న పలు వ్యాఖ్యానాలు వివాదాస్పదమవుతున్నాయి. ముల్లును ముల్లుతోనే తీయాలన్న సామెత మాదిరి ఉగ్రవాదాన్ని ఉగ్రవాదంతోనే ఎదుర్కొంటామని పారికర్ ప్రకటించడంపై మీడియాలో రచ్చరచ్చ అయ్యింది. బాధ్యతయుతమైన పదవిలో ఉండి దేశం పరువు తీసేలా పారికర్ వ్యవహరిస్తున్నారంటూ విపక్షాల నాయకులు ఆరోపించారు.
అయితే ఇకపై తాను వివాదాల్లో చిక్కుకోవద్దని పారికర్ భావించినట్లున్నారు. అందుకే ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారు. మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటే తాను ఎలాంటి చిక్కుల్లో పడనని అనుకున్నారేమో పారికర్ ఇకపై ఆరునెలల పాటు మీడియాతో మాట్లాడేది లేదని స్పష్టం చేశారు. ఓ కేంద్ర మంత్రి ఆరునెలల పాటు మీడియాతో మాట్లాడకపోవడం అనేది గతంలో ఎన్నడూ జరగలేదు. ఇక తాను మాట్లాడే సమయంలో జాగ్రత్త వహించకుండా ఇలా మీడియాపై అలగడం ఎంతవరకు సమంజసమనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.