అనుకోకుండా ఓటుకు నోటు కేసులో చిక్కుకుపోయిన టీడీపీ ఇప్పుడు అనవసర తప్పిదాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ కేసు నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి సెక్షన్8ను తెరమీదకు తెచ్చిన టీడీపీ నాయకులు ఇప్పుడు.. గవర్నర్ మీద కూడా అస్త్రాలు ఎక్కుపెట్టారు. పరుష పదజాలంతో తనపై టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శలకు గవర్నర్ నరసింహన్ కూడా నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు నమోదుతో నరసింహన్‌కు సంబంధం లేకున్నా.. ఆయన్ను ఎందుక తెరమీదకు తెస్తున్నారనే చర్చ ఇప్పుడు మొదలైంది.
ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ నరసింహన్ అంటే తెలంగాణవాదులకు కంటగింపుగా ఉండేది. ఆయన సీమాంధ్రకు మద్దతుగా కేంద్రానికి నివేదికలిస్తున్నాడని పలుమార్లు టీఆర్‌ఎస్ నాయకులు గవర్నర్‌ను నేరుగా విమర్శించారు. అలాంటిది విభజన పూర్తికాగానే గవర్నర్ తెలంగాణ పక్షం వైపు మొగ్గాడంటూ టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్నది టీడీపీ భాగస్వామిగా ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వం. ఇక గవర్నర్‌ను తొలగించే అధికారం కేంద్రానికి ఉంది. అలాంటి సమయంలో గవర్నర్ తప్పకుండా టీడీపీ వైపే ఉండే అవకాశాలున్నాయి. అయితే అనవసరంగా టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు గవర్నర్‌కు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. టీడీపీ నాయకుల ఆరోపణలపై ఆయన కేంద్రానికి ఫిర్యాదు చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అలాంటిదే జరిగితే ఇక టీడీపీ గవర్నర్ మద్దతు కూడా కోల్పోవాల్సి వస్తోంది. ఇప్పటికే టీడీపీతో అంటీముట్టన్నట్లు వ్యవహరిస్తున్న బీజేపీ పూర్తిగా చంద్రబాబును పక్కనపెడితే అప్పుడు ఆ పార్టీ పరిస్థితి మరింత దిగజారే అవకాశాలున్నాయి.