ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినాయకుడు చంద్రబాబు కోలుకోలేని ఎదురుదెబ్బలు తింటున్నాడు. ఈ కేసు నుంచి బయటపడాలని చంద్రబాబు ఎన్ని ఎత్తులు వేసినా కలిసి రావడం లేదు. తెలంగాణ ఏసీబీ పక్కాగా చంద్రబాబును ఈ స్కాంల్ ఇరికించినట్లు అర్థమవుతోంది. తాజాగా ఈసీ కూడా తెలుగుదేశం పార్టీకి షాక్‌నిచ్చింది. ఓటుకు నోటు కేసులో దర్యాప్తు పూర్తి సమాచారాన్ని తమకు ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది.
ఓటుకు నోటు కేసుపై ఏసీబీ విచారణను మొదటినుంచీ టీడీపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఈ కేసుపై ఏసీబీ ఎలా దర్యాప్తు చేస్తుందని, ఈ విషయం ఈసీకి సంబంధించినదని వారు వాదిస్తూ వచ్చారు. అయితే ఈసీ కూడా ఓటుకు నోటు కేసు దర్యాప్తు ఏసీబీయే కొనసాగించాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ కేసుతో సంబంధమున్న ప్రజాప్రతినిధుల నివేదికను తమకు సమర్పించాలని టీ-ప్రభుత్వాన్ని కోరింది. దీంతో టీడీపీ నాయకులు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. ఇక ఈ కేసుకు సంబంధించి అటు కేంద్రం నుంచి కూడా టీడీపీకి సాయమందే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ సహా మిగిలిన నాయకగణం మొత్తం చంద్రబాబు కేసుతో అంటీముట్టన్నట్లు వ్యవహరిస్తుండటం టీడీపీకి మింగుడుపడని విషయమే.