ప్రస్తుతం తెలుగునాట తీవ్ర సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసు విచారణను ఏసీబీ వేగవంతం చేసింది. ఈ రెండు మూడు రోజుల్లో ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా విచారణకు హాజరుకామని నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయి. ఇక బుధవారం సాయంత్రం టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పోటీచేసిన వేం నరేందర్‌రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
మంగళవారమే నరేందర్‌రెడ్డిని విచారణకు తరలించడానికి ఏసీబీ అధికారులు ఆయన ఇంటికి వచ్చారు. అయితే తన ఆరోగ్యం బాగా లేదని, బుధవారం తానే విచారణకు హాజరవుతానని నరేందర్‌రెడ్డి చెప్పారు. ఇక బుధవారం నరేందర్‌రెడ్డిని నాలుగు గంటలపాటు విచారించిన ఏసీబీ అనంతరం ఆయన్ను అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రేవంత్‌రెడ్డి, ఉదయసింహ, సెబాస్టియన్‌లను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక వేం నరేందర్‌రెడ్డి అరెస్టుతో ఇప్పటికి ఏసీబీ నలుగురిని కటకటాల వెనక్కు పంపించింది. ఇక టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్యే సండ్ర వెంకటరమణయ్య అరెస్టుకు కూడా ఏసీబీ సన్నాహాలు చేస్తోంది. ఆయన ఇంటి వద్దలేకపోవడంతో గేటుకు విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు అతికించి ఏసీబీ అధికారులు వెనుదిరిగారు.