ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలపై జాతీయ మీడియా, ఇతర రాష్ట్రాల మీడియా కూడా బాగా ఆసక్తి కనబరుస్తోంది. ఓటుకు నోటు కేసులో ఎలాంటి మలుపులు తిరుగుతుందో జాతీయ మీడియా కూడా పరిశీలిస్తోంది. ఇక ఈ కేసులో చంద్రబాబు పీకల్లోతూ కూరుకుపోయాడని నమ్ముతున్న మీడియా ఏపీ భవిష్యత్తు రాజకీయాలపై తనదైన శైలిలో వార్త కథనాలు ప్రచురిస్తుండటం ఇప్పుడు చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది.
ముంబైనుంచి ప్రచురితమయ్యే 'ముంబై మిర్రర్' అనే ఆంగ్ల దినపత్రిక ఏపీ రాజకీయాలపై ఓ ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు చెప్పింది. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు అశోక్‌జపతి రాజు ముఖ్యమంత్రి అవుతారని ప్రచురించింది. టీడీపీ నుంచి బాలకృష్ణ, నారాయణ, యనమలలు కూడా ముఖ్యమంత్రి పదవి కోసం పోటీలో ఉన్నా.. గజపతి రాజుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెప్పింది. అయితే ఈ వార్త కథనం నమ్మశక్యంగా లేదని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఒకవేళ ఓటుకు నోటు కేసులో బాబు సీఎం పదవికి రాజీనామా చేస్తే లోకేష్‌బాబును ముఖ్యమంత్రి చేస్తారనేది వారి వాదన. మరి లోకేష్‌కు కూడా ఈ కేసుతో సంబంధముంటే అప్పుడు రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందో..?