ఓటుకు నోటు కేసులో చంద్రబాబును, టీడీపీని ఇరుకున పెట్టిన కేసీఆర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కూడా ముచ్చమటలు పట్టిస్తున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్, అసభ్య పదజాలం వాడారంటూ ఆంధ్రప్రదేశ్‌లోని పదమూడు జిల్లాల్లో మొత్తం 40 కేసులు కేసీఆర్‌పై నమోదయ్యాయి. ఇందులో టీడీపీ కార్యకర్తలు పెట్టిన కేసులే అధికం. ఇక కొందరు ఏపీ మంత్రులు కూడా కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. ఇప్పుడు ఈ కేసులపై ఏం చేయాలన్నదానిపై తేల్చుకోలేక ఏపీ పోలీసులు సతమతమవుతున్నారు.
కేసీఆర్‌పై నమోదైన కేసుల గురించి పోలీసు ఉన్నతాధికారులు కూడా సమావేశమైనట్లు సమాచారం. అంతేకాకుంగా ఈ విషయమై వారు చంద్రబాబుతో కూడా చర్చించినట్లు తెలిసింది. సుప్రీంకోర్టు తీర్పు అనుసారం ఇలాంటి కేసులన్నింటినీ ఒకచోటుకు చేర్చి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఎలా ప్రోసీడ్ అవ్వాలన్నదానిపై ఇప్పుడు ఏపీ పోలీసు ఉన్నతాధికారులు తర్జనభర్జన పడుతున్నారు. మరోవైపు చంద్రబాబుకు వ్యతిరేకంగా కూడా తెలంగాణలో కూడా పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇక ఏపీ పోలీసులు వ్యవహరించే తీరునుబట్టి ఇక్కడ తెలంగాణ పోలీసులు బదులిస్తారనే దానిలో ఎలాంటి అనుమానం అక్కరలేదు.