ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో ఇరు రాష్ట్రాలకు సమాన హక్కులు ఉంటాయి. అయితే బాపు చెప్పినట్టే ఆడవాళ్లు, మగాళ్లు సమానమైనప్పటికీ మగాళ్లు కాస్త ఎక్కువ సమానమనట్టు.. ప్రస్తుతం హైదరాబాద్‌పై పూర్తిగా తెలంగాణ సర్కారు ఆధిపత్యమే కొనసాగుతోంది. అయితే రాష్ట్రం పరిధిలో ఉంటే ఓ వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ ఆ రాష్ట్ర సర్కారు పరిధిలో ఉంటుంది. ఇక హైదరాబాద్‌నుంచిపాలన సాగిస్తున్న చంద్రబాబు ఫోన్‌ను ట్యాపింగ్ చేసే అధికారం తెలంగాణ సర్కారుకు ఉన్నదా..? లేదా..? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తమ సీఎం ఫోన్‌ను ట్యాప్ చేసిన తెలంగాణ సర్కారుపై కేసు పెడతామని ఏపీ ఉన్నతాధికారులు వాదిస్తున్నారు. అదే సమయంలో తమ రాష్ట్రం పరిధిలో ఉండి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఫోన్ ట్యాప్ చేసే అధికారం తమకు ఉందంటూ తెలంగాణ సర్కారు వాదిస్తోంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కోర్టు గడప తొక్కే అవకాశం ఉంది. తెలంగాణ సర్కారుకు ఆ అధికారం ఉందా లేదా అన్నది న్యాయస్థానం స్పష్టం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ టీసర్కారుకు ఆ అధికారం లేకపోతే టీఆర్‌ఎస్‌కు కూడా కొన్ని చిక్కులు తప్పకపోవచ్చు. కాని చంద్రబాబు, రేవంత్‌రెడ్డి మాదిరి కేసీఆర్ మాత్రం అంతలోతుగా ఇరుక్కునే అవకాశాలు లేవన్నది నిపుణుల మాట.