ఓటుకు నోటు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. చంద్రబాబును పక్కాగా ఇరికించాలనే వ్యూహంతోనే రేవంత్ దొరికిన వారం తర్వాత బాబు ఆడియో టేపులను తెలంగాణ సర్కారు విడుదల చేసింది. అంతేకాకుండా జూన్ 8తో ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న చంద్రబాబుకు ఆ సంతోషం ఉండవద్దన్న ఉద్దేశంతోనే సరిగా జూన్ 7వ తేదీ రాత్రి టీ-సర్కారు ఆడియో టేపులను బయటపెట్టింది. ఆ తర్వాత వెంటనే గవర్నర్ నరసింహన్‌తో కేసీఆర్ భేటీ కావడంతో ఏ క్షణంలోనైనా చంద్రబాబు అరెస్టుకు వారెంట్ జారీ చేయవచ్చంటూ వార్తలు ప్రచురితమయ్యాయి.
ఇక ఇప్పుడు ఈ గొడవ కేంద్రం వద్దకు వెళ్లనుంది. చంద్రబాబు అరెస్టుకు వారెంట్ జారీ చేయాలంటే గవర్నర్ అనుమతి అవసరం. ఇక అదే సమయంలో కేంద్రం సూచన లేకుండా గవర్నర్ నిర్ణయం తీసుకునే పరిస్థితులు లేవు. దీంతో ఆయన కేంద్రం వద్దకు వెళ్లి ఏం తేల్చుకొస్తారనే దానిపై ఇప్పుడు చంద్రబాబు భవిష్యత్తు ఆధారపడి ఉన్నట్లు రాజకీయవర్గాల్లో చర్చలు కొనసాగతున్నాయి. ఇక కేంద్రానికి మిత్రపక్షమైన టీడీపీ ఏదైనా మంత్రాంగ నడపడమో.. లేక వెంకయ్య నాయుడు జోక్యం చేసుకొని కేంద్రానికి సర్దిచెప్పడమో చేస్తే చంద్రబాబుకు కాస్త టైం దొరికే అవకాశం ఉంది.