పొరుగు రాష్ట్రాల పొగతో ఉక్కిరి బిక్కిరవుతున్న ఆంధ్ర, కర్ణాటక
తమిళనాడుముఖ్యమంత్రి జయలలిత మిగులు ఆదాయం కేసు బెంగుళూరులో విచారణ జరగడంవలన పోలీసు బందోబస్తులకి, న్యాయవాదులకు, తమిళనాడు వెళ్తున్న కర్ణాటక బస్సుల ధ్వంసం వలన కోట్లాది రూపాయలు వ్యమయ్యాయని వాపోయిన కర్ణాటక ప్రభుత్వం హైకోర్టు తీర్పుని పైకోర్టులో సవాలు చేయాలని నిర్ణయించింది. బెంగుళూరు హైకోర్టు తీర్పుని సవాలు చేయడంవలన కర్ణాటక ప్రభుత్వానికి ఖర్చు పెరుగుతుంది, తమిళ సోదరుల నిరసన సెగ తగులుతుంది. అసలే తమిళనాడు కర్ణాటక మధ్య జల వివాదం జరుగుతోంది. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిపై సుప్రీంకోర్టుకి...! 19 ఏళ్ళు నడిచిన ఈ కేసుని సాగదీయాలనే కర్ణాటక ప్రభుత్వం నిశ్చయించింది.
తెలంగాణలో టిఆర్‌ఎస్ అధినేత ఆంధ్రులపట్ల పనిగట్టుకుని, పగబట్టినట్టు పదేపదే చేసే వ్యాఖ్యలు, రెచ్చగొట్టే భావోద్వేగాలు ఆంధ్రలో కాంగ్రెసుని సమాధిచేశాయి. తాజాగా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో వైయస్సార్‌సీపీ టిఆర్‌ఎస్ అభ్యర్ధులను సమర్ధించడం ఆంధ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికితోడు తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఉదంతాన్ని ఆంధ్ర, వైయస్సార్‌సీపీ నాయకులు చర్చనీయాంశంచేయడం పుండుమీద కారం అద్దినట్లుగా వుంది. జరిగిన సంఘటనతో తెలుగు తమ్ముళ్ళు ఖంగుతిన్నారు. ఇలా జరిగి వుండాల్సిందికాదని మధనపడుతున్నారు. కెసిఆర్ దెబ్బతీశాడని వ్యాకులత చెందుతున్నారు. ఈ నేపధ్యంలో ఆంధ్రా వైయస్సార్‌సీపీ నాయకుల ప్రకటనలు, టిఆర్‌ఎస్ అభ్యర్ధులకు తెలంగాణ వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేల మద్దతు ఆంధ్రలోని తెలుగు తమ్ముళ్ళ భావోద్వేగాలను రెచ్చగొట్టాయి. అందుకే అంటారు కందకులేని దురద కత్తిపీటకు ఎందుకు అని.