కృష్ణారెడ్డి గారూ ‘తనూ వెడ్స్ మనూ రిటర్న్స్’, ‘పీకు’ చూసికూడా మీరిలా మాట్లాడటమా!
30 కోట్లతో తీసిన ‘తనూ వెడ్స్ మనూ రిటర్న్స్’ 100 కోట్లు వసూలు చేసిన విషయాన్ని కాదు నేను ప్రస్తావించేది. మూడు సంవత్సరాలు మూసపోసిన కథలను కాదని మౌనంగా వున్న మాధవన్ బాక్సాఫీసు చేవ్రాలు ‘తనూ వెడ్స్ మనూ రిటర్న్స్’. విజయా, రాజశ్రీ, ప్రసాద్ ప్రొడక్షన్స్ (ఎల్వీ ప్రసాద్) స్థాయిలో సినిమాలు తీసిన దర్శకుడు - సంగీత దర్శకుడు - రచయిత - నటుడు ఎస్వీ కృష్ణారెడ్డి కమ్మర్షియల్ సినిమా తీస్తాను అనడం మనస్తాపాన్ని మిగిల్చింది. కాసులొచ్చిన ప్రతి సినిమా కమ్మర్షియల్ సినిమా. ఫిలిమ్ మేకింగ్‌లో కమ్మర్షియల్ ఫార్ములా అంటూ ఏదీ లేదు. ఆడియన్స్‌కి కనెక్టు అయితే చాలు. కాన్సెప్టు చాలా ముఖ్యం. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచ సినిమా సామాన్యుని అందుబాటులోకి వచ్చింది. సందర్భానుసారంగా పాత చిత్రాలలోని గొప్ప గొప్ప సన్నివేశాలనువాడుకోవడంలోనే ఫిలిమ్ మేకర్ గొప్పతనం వుంది. ఈ విషయంలో నిన్నటి రోజు మీది, ఈరోజు రాజమౌళిది, త్రివిక్రమ శ్రీనివాస్‌ది. మీవలె ఓ ఇంగ్లీషు సినిమా చేసే అవకాశం ఎంతమందికి వచ్చింది తెలుగులో ` అని ఆత్మ విమర్శ చేసుకోండి. ‘దసరా బుల్లోడు’ తీసిన రాజేంద్ర ప్రసాద్ తన సినిమాని మీ చేతుల్లో పెట్టారంటే ఒకనాడు మీరు తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతటి గౌరవాన్ని అందుకున్నారో అర్ధంజేసుకోండి. ‘సంస్కార, వంశవృక్ష’ కన్నడ సినిమాలకు పనిచేసిన సింగీతం శ్రీనివాసరావుకి, మీకు ఓ ప్రత్యేక స్థానం వుంది. సౌందర్య, బాబూమోహన్ మధ్య సాంగ్ పెట్టిన ద్రష్టలు మీరు ` అమితాబ్, దీపికాపడుకొణె, ఇర్ఫాన్‌ఖాన్ నటించి ‘పీకు’ చూసి కూడా మీరు కమ్మర్షియల్ సినిమా తీస్తాననడం భావ్యం కాదు. ప్రస్తుతం వస్తున్న తెలుగు సినిమాలలోని కామెడీ ట్రాక్స్ మూలాలు మీ సినిమాలలో కనిపిస్తాయి, జాగ్రత్తగా గమనిస్తే. మిమ్మల్ని ఒకరు అనుసరిస్తుంటే మీరు వేరెవర్నో అనుకరించాలనుకోవడం... మీ పాత బ్యాచ్ నరహరిబాబు వగైరాలను పోగెయ్యండి. బండిని ‘ట్రాక్’ మీద పెట్టండి.
- తోటకూర రఘు