తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందే కొన్ని విషయాల్లో ప్రాంతీయ భేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఇప్పుడు విడిపోయిన తర్వాత అది సినిమాల వరకు వచ్చింది. తాజాగా ఆకాష్ పూరి, ఉల్కగుప్త జంటగా రాజ్ మాదిరాజు దర్శకత్వంలో రమేష్ ప్రసాద్ నిర్మించిన ‘ఆంధ్రాపోరి’ చిత్రంపై ప్రాంతీయ వివాదం రాజుకుంది. ఈ చిత్రానికి ఆంధ్రాపోరి అనే టైటిల్ పెట్టడం వల్ల ఆంధ్ర ప్రాంత వాసుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆంధ్రా సెటిలర్స్ ఫోరమ్ హైకోర్టులో ఓ పిటిషన్ వేసింది. ఈ కేసుకు సంబంధించిన తుది విచారణ రేపు(4) జరగనుంది. ఈ టైటిల్ ఎనౌన్స్ చేసిన నాటి నుంచే ఈ వివాదం వున్నప్పటికీ టైటిల్ పెట్టడానికి గల రీజన్ ఏమిటో చిత్ర యూనిట్ చెప్తూ వస్తోంది. సినిమా కథకు యాప్ట్‌గా వుంటుందని ఆ టైటిల్ పెట్డడం జరిగిందే తప్ప ఒక ప్రాంతం వారిని నొప్పించే ఉద్దేశం తమకు లేదని, ఆ అవసరం కూడా తమకు లేదని యూనిట్ నొక్కి చెప్తోంది. ఏది ఏమైనా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ వివాదానికి రేపు హైకోర్టు తెరదించనుంది. ఈ చిత్రం జూన్ 5న విడుదలవుతున్న విషయం తెలిసిందే.