ఆకాష్ పూరి, ఉల్క గుప్తా జంటగా ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై రాజ్ మాదిరాజ్ దర్శకత్వంలో ఎ.రమేష్‌ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్రాపోరి’. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ కార్యక్రమాలు ముగించుకొని జూన్ 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సినిమా దర్శకుడు రాజ్ మాదిరాజ్, ఆకాష్ పూరి, ఉల్క గుప్తా విలేకర్లతో ముచ్చటించారు.
దర్శకుడు రాజ్ మాదిరాజ్ సినిమా గురించి ఈ విధంగా విశ్లేషించారు..!
ఈ జోనర్ అందరికీ కనెక్ట్ అవుతుంది..
'ఆంధ్రాపోరి' ఒక టీనేజ్ లవ్ స్టొరీ. ఈ జోనర్ లో చేసే సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఆ ఆలోచనతోనే సినిమా చేసాను. మరాఠిలో ఈ సినిమా భారీ సక్సెస్ సాధించింది. ఇదొక యూనివర్సల్ సబ్జెక్ట్. మూడు రోజులు ప్రేమించిన అమ్మాయి అబ్బాయికి కనిపించకపోతే ఎలా చలించిపోతాడో ఈ సినిమాలో చూపించాం.
స్వచ్చత అనేది ఈ జనరేషన్ కు అవసరం..
ప్రస్తుతం ఉన్న యువతకి సింప్లిసిటీ, అమాయకత్వం, స్వచ్చత అనేది చాలా అవసరం. అందరు సోషల్ మీడియాలో కొట్టుకుపోతున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే రకంగా ఉన్నారు. వారందరికీ ఓ మెసేజ్ ఇచ్చే విధంగా ఈ సినిమా ఉంటుంది.
మొదట పూరిజగన్నాథ్ సినిమాకి నో చెప్పారు..
ఈ సినిమాకి ఓ 17 ఏళ్ళ కుర్రాడు కొత్త కుర్రాడు కావాలి. ప్రేక్షకులకు పరిచయం ఉన్న వారు చేస్తే ఎలా ఉండాలో అని కొంచెం స్క్రిప్ట్ లో మార్పులు చేసుకున్నాను. ఈ సినిమాలో హీరో పక్కన నిలబడడానికి కూడా అసహ్య పడతారు. పాత్ర ఆవిధంగా ఉంటుంది. మరాఠి లో ఈ సినిమా కోసం ఓ మురికివాడ నుండి అబ్బాయిని తీసుకొచ్చి హీరోను చేసారు. తెలుగులో ఎవరిని ఎంచుకోవాలనే ఆలోచనలో ఉన్నప్పుడు పూరిగారిని కలిసి ఆకాష్ ను ఈ సినిమాలో నటించమని రిక్వెస్ట్ చేసాం. మొదట ఆయన ఒప్పుకోకపోయినా కథ విన్నాక ఓకే చెప్పారు. ఆకాష్ పూరి మా సినిమాతో పరిచయమవ్వడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమాలో నటించిన ఉల్క గుప్తాలో మంచి పవర్ ఉంది. తెలుగు డైలాగ్స్ గుర్తుపెట్టుకొని మరీ నటించింది.
సినిమా చూసినవారు బావుందనే చెబుతున్నారు..
ఈ సినిమా షూటింగ్ 32 రోజులలో కంప్లీట్ చేసాం. స్క్రిప్ట్ వర్క్ సుమారు 3 నుండి 4 నెలల వరకు చేసాం. సినిమా మొదటి కాపీ రెడీ అయిన తరువాత 70 మందికి షో వేసి చూపించాం. 92% మంది సినిమా బావుందనే చెప్పారు.
సినిమా గురించి ఆకాష్ పూరి మాటల్లో..
ఈ సినిమాలో నర్సింగ్ యాదవ్ అనే ఓ నిజామాబాద్ కుర్రాడి పాత్రలో నటించాను. హైపర్ యాక్టివిటీ తో, తనకంటే గొప్ప ఎవరు లేరు అనుకునే ఆబ్బాయి పాత్రలో నటించడం చాలెంజింగ్ గా అనిపించింది. సినిమాలో తెలంగాణా యాస మాట్లాడాలి. దానికోసం సుమారు 20రోజుల పాటు ఉత్తేజ్ గారు తెలంగాణా భాష నేర్పించారు. ఇది మరాఠి సినిమా రీమేక్ అయినా తెలుగు నేటివిటీ కి దగ్గరగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ సినిమా నా కెరీర్ కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఈ చిత్రం రిలీజ్ అయిన తరువాత 3 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని సినిమాలలో నటించాలనుకుంటున్నాను. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత రమేష్ ప్రసాద్ గారికి, దర్శకుడు రాజ్ మాదిరాజ్ గారికి థాంక్స్. ఈ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది.
ఉల్క గుప్తా తన అనుభవాల గురించి చెబుతూ..
సినిమా విడుదలవుతున్నందుకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. తెలుగులో మొదట 'రుద్రమదేవి' సినిమాలో అనుష్క చైల్డ్ రోల్ లో నటించాను. ఆ సినిమా తరువాత హీరోయిన్ గా 'ఆంధ్రాపోరి' లో నటించే అవకాశం వచ్చింది. ఆకాష్ లాంటి ఫ్యూచర్ సూపర్ స్టార్ తో నటించడం ఆనందంగా ఉంది. తెలుగు ఇండస్ట్రీలో సినిమాలపై అందరు చాలా ప్యాషనేట్ గా ఉంటారు. అలాంటి ఇండస్ట్రీలో నేను మొదటిసారి హీరోయిన్ గా పరిచయమవ్వడం గర్వంగా ఉంది. ఈ సినిమా లవ్ స్టొరీ అయిన అన్ని వర్గాల వారు చూసే విధంగా ఉంటుంది. అశ్లీలమైన పదజాలం, సన్నివేశాలు ఉండవు. భవిష్యత్తులో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించాలనుంది. గ్లామరస్ పాత్రలయినా స్క్రిప్ట్ నచ్చితే ఖచ్చితంగా నటిస్తాను.