ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనబోయి రేవంత్‌రెడ్డి ఏసీబీకి దొరికిపోయిన సంగతి తెలిసిందే. అయితే రేవంత్ ఒక్క స్టీఫెన్‌సన్‌కే కాకుండా మొత్తం 5 మంది ఎమ్మెల్యేలతో బేరసారాలకు దిగినట్లు ఇప్పుడు వార్తలు వెలువడుతున్నాయి. అందులో ఒకరికి రేవంత్ రూ.50 లక్షలు అడ్వాన్స్ కూడా చెల్లించినట్లు సమాచారం.
తెలంగాణలో టీడీపీ, టీఆర్‌ఎస్‌ల మధ్య రెండు రాష్ట్రాల సీఎంల మధ్య పోటీగా మారింది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీని గెలిపించే బాధ్యత రేవంత్‌రెడ్డి భూజాలపై పెట్టిన చంద్రబాబు.. ఆయన చెప్పిన వేం నరేందర్‌రెడ్డికి టికెట్ ఇచ్చారు. అంతేకాకుండా ఎమ్మెల్యేల కొనుగోలుకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని అందజేస్తానని, కనీసం ఓ 5 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని రేవంత్‌ను బాబు ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు రంగంలోకి దిగిన రేవంత్ స్టీఫెన్ సన్‌తోపాటు మరో నలుగురు ఎమ్మెల్యేలతోనూ చర్చలు జరిపారు. అందులో స్టీఫెన్‌సన్‌తోపాటు ఖమ్మం జిల్లాకు చెందిన మరొక ఎమ్మెల్యే కూడా రేవంత్ ఆఫర్‌ను అంగీకరించినట్లు సమాచారం. దీంతో ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకు అడ్వాన్స్‌గా రూ. 50 లక్షలు చెల్లించిన రేవంత్ స్టీఫెన్‌సన్‌కు కూడా అడ్వాన్స్ చెల్లించబోతూ అడ్డంగా బుక్కాయరని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇక రేవంత్ దొరికిపోవడంతో సదరు ఖమ్మం జిల్లా ఎమ్మెల్యే కూడా తాను తీసుకున్న రూ. 50 లక్షల అడ్వాన్స్‌ను తిరిగి పంపించేసినట్లు తెలిసింది. ఇక రేవంత్‌నుంచి ఆఫర్ తీసుకున్న ఆ ఖమ్మం జిల్లా ఎమ్మెల్యే ఎవరనేదానిపై ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తిగా చర్చలు జరుగుతున్నాయి.