సినిమా వ్యాపార రంగంలో సినిమా శాటిలైట్ హక్కులు సినిమా వ్యాపారాన్ని ఒక్క మలుపు తిప్పాయి. కొన్నేళ్ళ పాటు ఆ ఊపు కొనసాగింది. ఎంతలా అంటే శాటిలైట్ అమ్ముకోవడం కోసమే సినిమాలు తీశారు అంటే అతిశయోక్తి కాదు .. సినిమాలో హీరో ఉన్నా లేకపోయినా కూడా శాటిలైట్ ఎంతో కొంత అమ్ముడు అయ్యేది. హీరో ను బట్టి శాటిలైట్ ధర పలికేది ..అది లక్షలతో మొదలై కోట్ల వరకు వెళ్ళింది. కొందరు చిన్న చిన్న నిర్మాతలు ఓ మోస్తారు ఆర్టిస్టును పెట్టుకుని శాటిలైట్ కోసం సినిమా తీసేవారు.. కొందరు నిర్మాతలు దాన్ని ఒక కుటీర పరిశ్రమగా చేసుకుని సినిమాలు తీశారు. కొందరు చిన్న నిర్మాతలు ..దర్శకులు కూడా ఐదు నుండి పది వరకు సినిమాలు తీసిన వారు అనేక మంది ఉన్నారు. ఆ సినిమా పేర్లు ఎక్కడా విని ఉండరు కూడా.. అయితే ఉన్నట్టుండి శాటిలైట్ సినిమా పడిపోయింది. దానికి కారణం ఏమిటి అనేది విశ్లేషించవలసి వస్తే కర్ణుడి చావుకు అనేక కారణాలు అన్నట్టు ఈ శాటిలైట్ వ్యాపారం పడి పోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అస్సలు ఈ శాటిలైట్ సినిమాలను ఏమి చేస్తారు అనేది విశ్లేసించుకుంటే .. శాటిలైట్ సినిమాలను ఆయా ఛానల్స్ వారు తీసుకుని వారి ఛానల్ లో వీలును బట్టి ప్రదర్శిస్తుంటారు.. ఈ శాటిలైట్ హక్కులను ముందుగా కేబుల్ మరియు శాటిలైట్ హక్కులుగానే పరిగణించే వారు తదనంతరం కొత్త కొత్త మాధ్యమాలు రావడం తో ఈ శాటిలైట్ తో పాటు మిగిలిన హక్కులు అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన యూట్యూబ్ రైట్స్ తో సహ అన్నీ రాయించుకుంటున్నారు.. ఆ విషయాన్ని పక్కన పెడితే .. ఛానల్ లు తక్కువగా ఉన్న సమయంలో ఈ శాటిలైట్ విస్త్రుతంగా ఉన్న ఈ వ్యాపారం ఛానల్ లు పెరిగిన సమయంలో పడి పోవడం విశేషం.
అసలు ఈ శాటిలైట్ పడిపోవడానికి కారణం ఏమిటి అని విశ్లేషిస్తే ...శాటిలైట్ రైట్స్ కోసం కొందరు నిర్మాతలు సినిమాను చుట్టి వేయడంతో అందులో క్వాలిటీ లోపిస్తోంది అలాంటి సినిమాలు ఛానల్స్ లో ప్రసారం చేసినపుడు వాటికి రేటింగ్ లు రాక పోవడం లాంటి సమస్యలతో పాటు .. ఈ వ్యాపారంలో బ్రోకర్ల బెడద కూడా ఎక్కువయింది. ఇబ్బడి ముబ్బడిగా రేట్లు పెంచి శాటిలైట్ వ్యాపారానికి ఎక్కడ లేని క్రేజ్ తీసుకు వచ్చి పెట్టారు. అతి ఎక్కడ కూడా ఎక్కువ రోజులు పని చేయదు కాబట్టి ఇక్కడ కూడా అదే జరిగింది. శాటిలైట్ సినిమాలు కొనే ఛానల్ లు లేక పోవడంతో పెద్ద హీరోలు నటించిన సినిమాలకు మాత్రమే మార్కెట్ ఉంది. ఓ మోస్తారు హీరో సినిమాకు కూడా సినిమా విడుదలకు ముందు షాటిలైట్ బిజినెస్ లేదు.. అంటే ప్రస్తుతం శాటిలైట్ బిజినెస్ తన అసలు రూపానికి వచ్చింది అని చెప్పక తప్పదు. ఏదన్నా చిన్న సినిమా విడుదలై అది బాగుంది అని టాక్ వస్తే ఆ సినిమాను మాత్రమే కొంటున్నారు.
నిజం చెప్పవలసి వస్తే ఇదే నిజమైన శాటిలైట్ వ్యాపారం. ఏదైనా ఒక సినిమా విజయవంతం సాధిస్తే ఆ సినిమాను మాధ్యమాల ద్వారా ప్రసారం చేస్తే జనం కొంటారు. అయితే ఇక్కడ అలా జరగలేదు.. శాటిలైట్ ను అందనంత ఎత్తుకు తీసుకు వెళ్ళడంతో అది ఢమాల్ న కింద పడిపోయింది. ప్రస్తుతం శాటిలైట్ హక్కులు అమ్ము కోవడం కోసం కాకుండా ఫక్తు వ్యాపార దృక్పధంతో సినిమా తీసినప్పుడు .. ఆ సినిమా జనాధరణ పొందిన తరువాత శాటిలైట్ హక్కులు అమ్ముడవుతాయి.తప్ప గతంలో లాగా కేవలం శాటిలైట్ కోసం సినిమాలు తీసే రోజులు పునరావృతం కాదనేది సినిమా విశ్లేషకుల అంచనాలు.
-పర్వతనేని రాంబాబు