Advertisementt

'అక్షరాంజలి' పుస్తకావిష్కరణ..!

Mon 01st Jun 2015 05:42 AM
aksharanjali,bhageeratha,rosayya,ramanachari  'అక్షరాంజలి' పుస్తకావిష్కరణ..!
'అక్షరాంజలి' పుస్తకావిష్కరణ..!
Advertisement
Ads by CJ

ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ భగీరథ కవితలతో కూడిన 'అక్షరాంజలి' అనే సంకలనాన్ని రచించారు. ఈ రచనను భగీరథ కె.వి.రమణాచారికి అంకితం ఇచ్చారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోశయ్య, కోడెల శివప్రసాద్, కె.వి.రమణాచారి, సి.కళ్యాన్, చెరుకూరి హరిప్రసాద్, పుల్లెల గోపీచంద్, వై.వి.ఉమాపతి వర్మ, కె.వి.కృష్ణకుమారి, శివాజీరాజా, ఆళ్ళ శ్రీనివాస్, వంశీ రామరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సభాపతి కోడెల శివప్రసాద్ మాట్లాడుతూ "30 కవితలతో కూడిన ఈ రచనాన్ని భగీరథ మనసుపెట్టి రాసారు. ఎన్నో రచనలను రాసిన అనుభవం ఉన్న వ్యక్తి ఆయన. మంచి చిత్రాలతో ఈ రచనను ప్రచురించారు. భగీరథ చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. ఈ 'అక్షరాంజలి'లో నాగండ్ల గ్రామం గురించి అక్కడ పుట్టిన మహనీయులు గురించి వివరించారు. ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే గ్రంధం రాసారు. స్వీయకర్తగా రమణాచారి గారు ఉండడం ఆనదకరమైన విషయం" అని అన్నారు.

రోశయ్య మాట్లాడుతూ "శాసనసభ సభ్యుడిగా ఉన్న రోజుల్లో దగ్గరగా పరిచయమున్నటువంటి పాత్రికేయ మిత్రుల్లో భగీరథ ఒకరు. తన పని తాను చేసుకుంటూ పోయే మనిషి. ఓ జర్నలిస్ట్ గా వార్తలు సేకరించడం ఒక పద్ధతి. అలా కాకుండా సొంతంగా ఓ రచన చేయడం చాలా గొప్ప విషయం. అలాంటిది ఈరోజు భగీరథ 'అక్షరాంజలి' అనే పుస్తకాన్ని రచించాడు. నాకు మంచి మిత్రుడైన ఆయన చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ ఆయనను అభిమానించే మిత్రుడిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యాను. భగీరథ  మరిన్ని పుస్తకాలను రచించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

శివాజీరాజా మాట్లాడుతూ "30 సంవత్సరాలుగా భగీరథ గారు మాకు మంచి ఆప్తులు. ఆయన రాసిన ప్రతి అక్షరం తెలుగువారి గుండెల్లో నిలిచిపోవాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

సి.కళ్యాన్ మాట్లాడుతూ "సినిమా ఇండస్ట్రీకి సేవలందించిన ఆఫీసర్స్ లో రమణాచారి గారు ప్రముఖులు. అలాంటి ఆయనకు ఈ 'అక్షరాంజలి' అంకితం ఇవ్వడం ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేసినందుకు భగీరథ గారికి నా ధన్యవాదాలు. ఆయన మరిన్ని రచనలను రచించాలని ఆశిస్తున్నాను" అని చెప్పారు.

వై.వి.ఉమాపతి వర్మ మాట్లాడుతూ "ఆత్మ, పరమాత్మ రెండింటిని మిళితం చేసే ప్రయత్నం చేసాడు భగీరథ. ఆయన రచనలు శ్రద్ధగా చదివితేనే అర్ధం అవుతాయి" అని చెప్పారు.

కె.వి.కృష్ణకుమారి మాట్లాడుతూ "సుమారు ముప్పై సంవత్సరాల క్రితం భగీరథ గారు అక్షరాంజలి రాయడం మొదలుపెట్టారు. ఆ రచనను నాకు వినిపించినపుడు పుస్తక రూపంలో ఉంటే బావుంటుందని చెప్పాను. ఈరోజు 'అక్షరాంజలి' రచనను ఆవిష్కరించడం ఆనందదాయకం" అని చెప్పారు.

భగీరథ మాట్లాడుతూ "ఈరోజు నా జీవితంలో ఓ విశేషమైన రోజు. 1980వ సంవత్సరం జూన్ 1వ తేదీన నేను రాసిన 'మానవత' అనే పుస్తక ఆవిష్కరణ ప్రముఖ కవి శ్రీశ్రీ చేతుల మీదుగా జరిగింది. ఇప్పుడు నేను రచించిన 'అక్షరాంజలి' పుస్తకావిష్కరణ కూడా జున్1 న జరిపించమని రోశయ్య గారు చెప్పడం యాదృచ్చికంగా ఉంది. ఈరోజు ఈ సభ నా సాహిత్య జీవితానికి మరోమెట్టని భావిస్తున్నాను. ఈ పుస్తకం వెలుగు చూడడానికి ముఖ్య కారకులు సి.కళ్యాన్ గారు. ఆయనకు నా ధన్యవాదాలు. రమణాచారి గారికి పుస్తకం అంకితం ఇవ్వడం ఆనందంగా ఉంది. రావిపూడి వెంకటాద్రి, చెరుకూరి హరిప్రసాద్, పుల్లెల గోపీచంద్ వంటి ఆణిముత్యాలు జన్మించిన ఊరు గురించి వారి గురించి రాయాలనుకున్నాను. అదే ఊరులో నేను పుట్టానని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది" అని చెప్పారు.

రమణాచారి మాట్లాడుతూ "ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నన్ను బాగస్తుడిని చేయడం, 30 కవితలతో కూడిన ఈ 'అక్షరాంజలి' నాకు అంకితం చేయడం ఆనందంగా ఉంది. ఈ రచనలో అక్షరాలన్నీ ఒక ఎత్తయితే చిత్రాలన్నీ ఒక ఎత్తు. ప్రతి చిత్రం ఫ్రేం కట్టించుకోవాలని అనిపించే విధంగా చిత్రాలను అందించిన సురేష్ గారికి నా ధన్యవాదాలు. భగీరథ ఈ రచనలో తను పుట్టి పెరిగిన గ్రామం గురించి, తనకు చదువు చెప్పిన మాస్టర్ గురించి రాయడంలో తన గురు భక్తి తెలుస్తుంది. త్వరలోనే ఆయన 'భారత్-అమెరికా' అనే మరో రచనను కూడా రచించనున్నారు" అని తెలిపారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ