గత రెండేళ్లలో రాజకీయపరంగా కూడా సోషల్ నెట్‌వర్క్‌కు ఎనలేని ప్రాధాన్యత చేకూరింది. ఏకంగా ప్రధాని మోడీ కూడా ట్విట్టర్‌లో ఎకౌంట్ మెయింటేన్ చేస్తూ ప్రజలను ఆకర్శించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలను, ప్రణాళికలను ఆయన ట్విట్టర్ ద్వారా ప్రజలతో పంచుకుంటున్నారు. ఇక కాస్త ఆలస్యమైనప్పటికీ ఇటీవలే జగన్ కూడా ట్విట్టర్ ఎకౌంట్ ఓపెన్ చేశారు. అధికారపార్టీని విమర్శించడంతోపాటు తన కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా ప్రజలతో పంచుకుంటున్నారు.
తాజాగా ఏపీలో డ్వాక్రా రుణాలు, నిరుద్యోగ సమస్యపై జగన్ చేసిన ట్వీట్ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబు డ్వాక్రా రుణాల మాఫీకి రూ. 2700 కోట్లు విడుదల చేశారు. దీనిపై జగన్ స్పందిస్తూ.. చంద్రబాబు చేసిన మోసంతో మహిళలు అప్పుల ఊబిలో కూరుకుపోయి కన్నీరుపెడుతున్నారని, డ్వాక్రా రుణాలను చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి డ్వాక్రా చెల్లెమ్మలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే డ్వాక్రా సంఘాల్లో 18 ఏళ్ల నుంచి పండు ముసలి వరకు కూడా సభ్యత్వాలు పొందారు. మరి వీరందర్ని చెల్లెల్లు అని జగన్ సంబోధించడం సముచితం కాదని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇప్పటికే జగన్ తన యాత్రల్లో భాగంగా మహిళల నుదుటిపై ముద్దుపెట్టుకోవడం గురించి మీడియా వ్యంగ్రస్తాలు ఎక్కుపెడుతోంది. ఇలాంటి తరుణంలో జగన్ ఇలా వ్యాఖ్యానించడం మీడియాను మరింత ప్రోత్సహించడమే అవుతుంది.