ఢిల్లీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్‌కు, తనకు మధ్య నెలకొన్న వివాదాన్ని అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు, కేంద్రానికి మధ్య తగువులా మార్చడానికి ఎత్తులు వేస్తున్నాడు. అయితే ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయం కావాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే ఇవ్వడం అరవింద్ కేజ్రీవాల్‌కు ఇప్పుడు మింగుడుపడకుండా మారింది.
అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్‌ల మధ్య కొనసాగుతున్న వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక్కడ హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది. అంతేకాకుండా మూడు వారాల్లోగా దీనిపై అభిప్రాయం చెప్పాలని ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం సుప్రీంలో కొనసాగుతున్న పరిణామాలు ఢిల్లీ ప్రభుత్వానికి ఏమాత్రం అనుకూలంగా లేవు. ఇక సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆమ్ ఆద్మీ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది ఢిల్లీ ప్రజలను అవమానించడమేనంటూ ఆ పార్టీ నేత సోమనాథ్ భారతీ ప్రకటించారు. అయితే మన రాజ్యాంగంలోనే యూటీ ప్రాంతాలపై కేంద్రం ఆధిపత్యం గురించి స్పష్టతనిచ్చారు. ఇక ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం రాగానే రాజ్యాంగానికే సరికొత్త భాష్యం చెప్పలని ఆప్ నాయకులు ఆలోచించడకం దురాశ అనే చెప్పవచ్చు. అంతగా కావాలంటే మిగిలిన పార్టీలతో కలిసి రాజ్యంగంలో సవరణకు ఆప్ పట్టుబట్టవచ్చు. కాని అధికారంలోకి వచ్చిందే తడవుగా తమకే అన్ని అధికారాలు కావాలనడం సబబు కాదనేది విశ్లేషకుల మాట.