ఎమ్మెల్సీ ఎన్నికల్లో సునాయసంగా గెలుస్తామనుకున్న కాంగ్రెస్‌కు ఇప్పుడు ఓటమి భయం పట్టుకుంది. తమకున్న 18 మంది ఎమ్మెల్యేలతో ఒక్క ఎమ్మెల్సీ సీటును సులభంగా గెలుపొందుతామని ఆ పార్టీ అగ్రనాయకులు భావించారు. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న పరిణామాలు ఇప్పుడు ఆ పార్టీ నాయకులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం 17 మంది ఎమ్మెల్యేలు, ఓ అనుబంధ ఎమ్మెల్యే ఉన్నారు. అయితే వీరిలో నలుగురు టీఆర్‌ఎస్‌తో టచ్‌లో ఉన్నట్లు వార్తలు వెలువడుతుండటంతో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చెందుతున్నారు. పార్టీ అనుబంధ సభ్యుడు దొంతి మాధవరరెడ్డితో టీఆర్‌ఎస్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అందగానే సీఎల్సీ నేత జానారెడ్డి ఆయనతో మాట్లాడారు. అలాగే నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేతోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేల వ్యవహారతీరుపై కాంగ్రెస్ నాయకుల్లో అనుమానాలున్నాయి. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ వారు చేజారకుండా చూస్తున్నారు. అంతేకాకుండా తమకున్న 18 మంది ఎమ్మెల్యేలతో ఈనెల 31న గోల్కొండ రిసార్ట్స్‌లో క్యాంపు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది.