ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న వాస్తు నమ్మకాలు రాష్ట్రంపై ఆర్థికభారం మోపుతున్నాయి. ఇప్పటికే కోట్లు ఖర్చుపెట్టి తన కార్యాలయానికి చంద్రబాబు మరమ్మతులు చేయించిన సంగతి తెలిసిందే. ఇక తన సొంతింటిని తిరిగి నిర్మిస్తున్న చంద్రబాబు ఇటీవలే అద్దె ఇంట్లోకి మారిన సంగతి తెలిసిందే. ఇక ఈ అద్దె ఇంటికి రూ. కోటికిపైగా ఖర్చుచేసి మరమ్మతులు చేయిస్తుండటం ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణమవుతోంది.
ఈ ఏప్రిల్‌లో చంద్రబాబు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్డు నెం.24లో ఓ అద్దె ఇంట్లోకి మారాడు. ఆయన ఈ ఇంట్లోకి మారుతుండటంతో అంతకుముందే అధికారులు దాదాపు రూ. 67.50లక్షలు ఖర్చుచేసి సీసీ టీవీలు, సోలార్‌ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత విద్యుత్ పనుల కోసం మరో రూ. 6లక్షలు ఖర్చుచేశారు. చంద్రబాబు ఈ ఇంట్లోకి వచ్చిన వెంటనే షెడ్ల నిర్మాణం కోసం రూ.7.60 లక్షలు ఖర్చుచేశారు. దీంతో మొత్తం 81.10లక్షలు ఈ ఇంటికోసం ఖర్చు చేసినట్లు అయ్యింది.
ఇక తాజాగా ఈ ఇంటి విద్యుద్దీకరణ పనుల కోసం రూ.35 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. దీనికితోడు ఈ అద్దె ఇంట్లో క్యాంపు కార్యాలయం నిర్మాణం కోసం మరో 20.85 లక్షలు కేటాయించారు. ఇక గతంలో ఖర్చు చేసినవి, ఇక తాజాగా విడుదలైన నిధులనను కలుపుకుంటే బాబు నివాసముంటున్న అద్దె ఇంటికోసం రూ.1.36 కోట్లు ఖర్చు అయ్యింది. రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కిరాయి ఇంటికోసం ఇంతపెద్ద మొత్తంలో ఖర్చుపెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.