జూన్ 6న ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి శంఖుస్థాపన జరగనుంది. ఇప్పటికే భూముల సేకరణ ఓ కొలిక్కి వచ్చింది. అక్కడక్కడా కొందరు రైతులు భూముల ఇవ్వడానికి అంగీకరించనప్పటికీ వారిని నయానో..భయానో దారికి తీసుకురావచ్చని ప్రభుత్వం భావిస్తుంది. ఇక రాజధానికి భూముల సేకరణ పూర్తి కావడంతో భూముల విలువ పెంచడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
గతేడాది అధికారంలోకి రాగానే భూముల విలువలను ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధర ప్రకారం పెంచాలని ప్రభుత్వం ఆలోచించింది. అయితే భూముల విలువ పెంచితే రాజధాని కోసం సేకరించిన భూములకు కూడా అదే ధరను చెల్లించాల్సి వస్తుందని యోచించి ఆ ఆలోచనను కొన్నాళ్లు వాయిదా వేసింది. ఇప్పుడు భూముల సేకరణ ఓ కొలిక్కి రావడంతో భూముల విలువను పెంచాలనే నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న భూముల విలువలో దాదాపు 60శాతం వరకు ప్రభుత్వ ధర పెంచనుందని సమాచారం. దీంతో ప్రస్తుతం అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా జరుగుతున్న రిజిస్ట్రేషన్లతో ప్రభుత్వానికి కూడా పెద్ద మొత్తంలో ఆదాయం రానుంది. అయితే భూముల విలువ పెంచితే రైతులు కూడా ఆ ధర ప్రకారమే తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.