టి.సుబ్బిరామిరెడ్డి రాజకీయవేత్తగా కంటే కూడా వ్యాపారవేత్తగా, కళాపోషకుడిగానే జనాలకు బాగా పరిచయం. ఆయన దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నా ఎప్పుడుగాని ప్రజల పక్షాన పోరాడినట్లుగాని.. ఆందోళనలు చేసినట్లుగాని ఎవరూ ఎరుగరు. అలాంటిది ఇప్పుదు ఆయన కూడా దీక్షకు దిగబోతున్నాడు. ఏపీకి ప్రత్యేకహోదాపై కేంద్రం స్పష్టతనివ్వడం లేదు. ఇక కేంద్రమంత్రుల మాటతీరు చూస్తే ఏపీకి ప్రత్యేక హోదా దక్కేది అనుమానంగానే కనబడుతోంది. దీంతో అగ్గిమీద గుగ్గిలమవుతున్న కాంగ్రెస్ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
వాస్తవానికి ఏపీకి ప్రత్యేక హోదాపై విభజన చట్టంలో ఏమి పేర్కొనలేదు. విభజన సజావుగా సాగడానికి, పార్లమెంట్‌లో ఎంపీలు విభజనకు సహకరించడానికి ఏపీకి ప్రత్యేకహోదాను పరిశీలిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అలా ప్రత్యేక హోదా అనే తేనెతుట్టును తాను కదపకుండా వచ్చే ప్రభుత్వంపైకి నెట్టింది. ఇక అప్పుడు పార్లమెంట్‌లో ఉన్న కాంగ్రెస్ నాయకులు చడీచప్పుడు కాకుండా విభజనకు మద్దతు ఇచ్చారు. అప్పుడే ప్రత్యేకహోదాపై చట్టం చేయాలని పట్టుబడితే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు. ఇక ఏపీలో అస్తిత్వం లేకుండాపోయిన కాంగ్రెస్‌ను తిరిగి బలపర్చడానికి ఆ పార్టీ నాయకులు ప్రయత్నాలు మొదలుపట్టారు. అందులోబాగంగానే ప్రత్యేకహోదాను డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టనున్నారు. పనిలో పని తాను కూడా జూన్ 6న ఉదయం నుంచి సాయంత్రం వరకు రిలే దీక్ష చేయనున్నట్లు సుబ్బిరామిరెడ్డి ప్రకటించారు. అలా స్వామికార్యం స్వకార్యం రెండూ పూర్తవుతాయన్నదే సుబ్సిరామిరెడ్డి ఆలోచన కావచ్చు.