మనం చూస్తుండగానే మార్పులు జరుగుతుంటాయి.. నిన్ననే చూసినట్టు ఉంటుంది అప్పుడే మాయమై పోతుంటుంది.
ఫిలిం గా మనకు పరిచయమై ... కొన్ని తరాల వరకు ఎన్నో గొప్ప అనుభూతులను మిగిల్చిన ఫిలిం అంతరించి పోయింది.
రీలు జ్ఞాపకాలను చుట్టలుగా చుట్టుకుని జ్ఞాపకాల్లో మిగిలి పోయింది. ఒకప్పుడు సినిమా రీలు రూపంలో ఉండేది.. రీలు బాక్స్ లు థియేటర్ ఉండే ప్రతి ఊరికి వెళ్లేవి అదంతా ఒక ప్రహసనం .. ఓ ఐదారు సంవత్సరాల క్రితం వరకు తమ అభిమాన హీరో సినిమా విడుదల రోజున రీలు బాక్స్ తమ ఊరికి వస్తే ఎడ్లబండ్లమీద ట్రాక్టర్ ల మీద ఊరేగించుకుంటూ తీసుకు వెళ్ళేవారు.. తమ అభిమాన హీరో సినిమా విజయవంతం కావాలని కొబ్బరి కాయ కొట్టి బాక్స్ కు పూజలు చేసేవారు. అవన్నీ పాత రోజులు .. సినిమా రీలు ఉన్న బాక్స్ చూస్తే అదో చెప్పలేని అనుభూతి.. ఒక్క బాక్స్ రెండు మూడు థియేటర్లలో వేసే వారు.. ఒక థియేటర్ నుండి ఒక థియేటర్ కు రీల్లు తీసుకుని పోయేవారు.. ట్రాఫిక్ లో సకాలంలో రీలు చేర్చడం అంటే మామూలు విషయం కాదు అదో థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ..ప్రస్తుతం పెరిగిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సినిమా వీధిన పడింది. ఒకప్పుడు సినిమా నటులతో పాటు .. సినిమా తీయడం కూడా చాలా గోప్యంగా ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ ప్రజల చేతుల్లోకి వెళ్ళి పోవడంతో సినిమా కున్న క్రేజ్ తగ్గుతూ వస్తోంది. ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ సినిమా ఫిలిం విషయానికి వస్తే ఫిలింలో చిత్రీకరింప బడుతోంది కాబట్టి సినిమాను ఫిలిం అని పిలిచే వారు .ఇప్పుడా పిలుపుకు అర్థమే మారిపోయింది. సినిమా చిత్రీకరణలో అనేక మార్పులు వచ్చాయి.. అసలు సినిమా బొమ్మను చూపించే కెమెరాలో పెను మార్పులు సంభవించాయి.గతంలో ఉన్న సినిమా కెమెరాల్లో ఎవ్వరూ సినిమాలు తీయడం లేదు ..ప్రస్తుతం వీడియో కెమెరాతోనే సినిమాలు చేస్తున్నారు.. రకరకాల కెమెరాలు ఒకదాన్ని తలదన్నేది ఒకటి వస్తూనే ఉన్నాయి. సినిమా రీలు తో ఎంతో మంది జీవితాలకు అనుబంధం ఉంది. రీలు తయారు చేసే కంపెనీలో పని చేసేవారు .. రీలు పెట్టుకునే బాక్స్ లు తయారు చేసేవారు.నెగిటివ్ ను కట్ చేసే నెగిటివ్ ఎడిటర్లు ఇలా చాలా మందికి దీని వల్ల ఉపాది పోయింది.
ప్రస్తుతం అనుసరిస్తున్న సినిమా థియేటర్లలో ప్రొజక్టర్ లకు పని లేకుండా పోయింది, ప్రస్తుతం యుయఫ్ ఓ, క్యూబ్, పిఎక్స్ డి అనే మూడు విధానాల్లో శాటిలైట్ ద్వారా సినిమా ప్రదర్శింప బడుతోంది. సినిమాను విడుదల చేసే ముందు ఏ ఏ ఊర్లలో ఏఏ థియేటర్లలో సినిమా విడుదలవుతోందో .. సంబందిత సినిమా ప్రదర్శన కారులు ఆ సినిమాల లిస్టును ఈ మూడు శాటిలైట్ విధానాలు కలిగిన వారికి ఎవరికో ఒకరికి ఇస్తారు.వారి ద్వారా సినిమా ఒకే సారి అన్ని థియేటర్లలో ఒకే సమయంలో ప్రదర్శింప బడుతుంది. యుయఫ్ఓ .. క్యూబ్ , పిఎక్స్ డి కంపెనీల వారు అందుకు కావలసిన పరికరాలను ముందే ఆయా థియేటర్లలో ఉంచి ఉండటం వలన .. ఈ విధంగా సినిమా ప్రదర్శించడం సులువుగా జరుగుతుంది. వ్యాపార పరంగా సినిమా ప్రదర్శన దారులకు గాని పంపినీ దారులకు గాని దీని వలన ఉపయోగం ఏమీ లేదు.. ఒకప్పుడు సినిమా పంపిణీ సంస్థలు ఉండేవి .. వాటి వద్దనుండి థియేటర్ల వారు రీలు బాక్స్ లను తీసుకుని వెళ్ళి ఆడించుకునే వారు. ఈ విధానం ఇప్పుడు పూర్తిగా మారి పోయింది. ప్రస్తుత తరం వరకు సినిమాకు రీలు వాడే వారు అనే విషయం తెలిసినా భవిష్యత్ తరాల వారికి ఫిలిం అనే దానికి అర్థం కూడా తెలియక పోవచ్చు.
-పర్వతనేని రాంబాబు