ఆంధ్రప్రదేశ్‌లో మరో ఇద్దరికి మంత్రి పదవులు ఖాయమయ్యాయి. ఈ మేరకు ఆ ఇద్దరికి టీడీపీ అధినేత నుంచి స్పష్టమైన సంకేతాలు వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో మైనార్టీ వర్గం నుంచిగానీ ఎస్టీ వర్గం నుంచిగానీ మంత్రులు లేరు. దీంతో ఈ రెండు వర్గాల నాయకులకు వచ్చే మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో ఎమ్మెల్సీ తంతు ముగియగానే చంద్రబాబు మంత్రి వర్గాన్ని విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన సంధ్యారాణికి ఎస్టీ కోటాలో మంత్రి పదవి దక్కునుందని సమాచారం. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ వేసిన షరీఫ్‌కు కూడా బాబు మంత్రిగా అవకాశం ఇవ్వనున్నారు. మైనార్టీ కోటాలో మంత్రులు ఎవరూ లేకపోవడంతో షరీఫ్‌కు మంత్రి పదవి దక్కునుంది. మరోవైపు ఎలాంటి విభేదాలు లేకుండా 15 మంది ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. పదవులకు పోటీపడే ఆశావహుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ అందర్ని కలుపుకుంటూ బాబు నిర్ణయాలు తీసుకోవడంపై తెలుగు తమ్ముళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.