విభజన ఒప్పందాలను తెలంగాణ సర్కారు తొంగలో తొక్కుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రైవేటు వాహనాలకు ఎంట్రీ ట్యాక్స్ విధించిన టీ-సర్కారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు కూడా ఎంట్రీట్యాక్స్ కట్టాల్సిందేనని వాదిస్తోంది. ఈ మేరకు జీఓ విడుదల చేయడానికి కసరత్తులు ప్రారంభించింది. ఇదే జరిగితే హైదరాబాద్‌నుంచి ఏపీకి వెళ్లే ప్రయాణికులు మరింత భారం మోయక తప్పదు.
ఆర్టీసీ ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్ ఇచ్చినా ఆర్టీసీ చార్జీలను మాత్రం పెంచబోమని ఏపీ సర్కారు స్పష్టంచేసింది. అదే సమయంలో మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణ సర్కారు మాత్రం బస్సుల చార్జీలు పెంచకతప్పడం లేదని, త్వరలోనే చార్జీలు పెరుగుతాయని పేర్కొంది. దీనికితోడు ఆదాయ వనరులను పెంచుకోవడానికి ఏపీ నుంచి ఆర్టీసీ బస్సులకు కూడా ఎంట్రీ ట్యాక్స్ విధిస్తామని చెప్పింది. బహుశా ఈనెల 28న రెండు రాష్ట్రాలకు సంబంధించి ఆర్టీసీ విభజన జరగగానే ఎంట్రీట్యాక్స్‌పై ప్రభుత్వం జీఓ జారీ చేసే అవకాశం ఉంది. ఇక ఏపీలో ఆర్టీసీపై కార్మికుల వేతనాల పెంపుతో పెద్దమొత్తంలో భారంపడింది. ఇక ఇప్పుడు ఎంట్రీట్యాక్స్‌రూపంలో మరో భారం కూడా దానికి అదనంగా మారడంతో చార్జీలు పెంపు తప్పకపోవచ్చని ఆర్టీసీ కార్మికులే చెబుతున్నారు. ఎంట్రీ ట్యాక్స్‌ను సాకుగా చూపి బాబు కూడా ఆర్టీసీ చార్జీలను భారీ మొత్తంలో పెంచే అవకాశాలున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలా ఎంట్రీ ట్యాక్స్ రూపంలో చంద్రబాబుకు కేసీఆర్ పెద్ద సాయమే చేస్తున్నట్లు కనిపిస్తోంది.