ఎట్టకేలకు తమిళనాడులో సస్పెన్స్ వీడింది. జయలలిత సీఎంగా ప్రమాణా స్వీకారం చేస్తారా..? చేస్తే ఎప్పుడు చేస్తారు..? అనే విషయాలపై కొన్ని రోజులుగా ఆ రాష్ట్రంలో తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. దీనిపై ఎట్టకేలకు అన్నా డీఎంకే నాయకులు స్పష్టతనిచ్చారు. ఈ నెల 23న జయలలిత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రకటించారు.
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జయను ప్రత్యేక న్యాయస్థానం దోషిగా పేర్కొనడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి జయలలిత జైలుకెళ్లారు. ఆ తర్వాత సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇక ఈ కేసులో ప్రత్యేక న్యాయస్థానం తీర్పును కొట్టివేస్తూ బెంగళూరు హైకోర్టు జయను నిర్దోషిగా ప్రకటించింది. దీంతో జయలలిత తిరిగి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావించారు. కాని ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు ప్రతివాది సుబ్రమణ్యస్వామి కేసు వేయడంతో మళ్లీ సస్పెన్స్‌కు తెరలేచింది. ఇక సుప్రీంలో కూడా ఈ విషయంపై స్పష్టత వచ్చే వరకు జయ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయరనే వాదనలు వినిపించాయి. కాని మే 23న ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఏడీఎంకే ప్రకటించడంతో అన్ని అనుమానాలు దూరమయ్యాయి. ప్రస్తుత సీఎం పన్నీర్ సెల్వం మే 22న రాజీనామా చేయనున్నారు. ఇక 9 నెలలుగా ప్రజల ముందకు రాని జయలలిత జూన్ 22న భారీ ర్యాలీలో పాల్గొననునన్నారు. ఆ మరుసటి రోజు ఆమె సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు.