ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ల మధ్య వివాదం ముదిరింది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గత ఐదు రోజులుగా ముఖ్యమంత్రి జారీ చేసిన నియామక ఆదేశాలన్నింటినీ రద్దు చేస్తూ జంగ్ ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారింది.
భారత్‌లోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా ఢిల్లీకి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ కేంద్రం ఆదేశాలతో పనిచేసే లెఫ్టినెంట్ గవర్నర్, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రికి కూడా అధికారాలుంటాయి. ఇప్పుడు ఇదే జంగ్, కేజ్రీవాల్ మధ్య యుద్ధానికి దారి తీసింది. ప్రిన్సిపల్ సెక్రెటరీ నియామకానికి సంబంధించివారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఒకరు నియమించిన ప్రిన్సిపాల్ సెక్రెటరీని మరొకరు తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారిద్దరూ ఒకరిపై ఒకరు రాష్ట్రపతికి, ప్రధానికి ఫిర్యాదు చేసుకున్నారు. ఈ అంశం రాష్ట్రపతి పరిధిలో ఉండగానే జంగ్ మరోమారు కేజ్రీవాల్ ఆదేశాలను రద్దుచేయడంతో ఢిల్లీలో పాలన పూర్తిగా గాడితప్పినట్లయింది. జంగ్ తీరుపై ఆప్ నేతలు మండిపడుతున్నారు. కేంద్రం అండతోనే ఆయన రెచ్చిపోతున్నాడని ఆరోపస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఢిల్లీలో రాజకీయ సంక్షోభం తప్పేల కనబడటం లేదు. ఈ ఇద్దరి వివాదం నడుమ ఢిల్లీలో పనిచేయడానికి అధికారులు కూడా జంకుతున్నారు. మరి ఈ వివాదాన్ని రాష్ట్రపతి ఎలా పరిష్కరిస్తారో వేచిచూడాలి.