వలసల పార్టీ అంటూ.. టీఆర్‌ఎస్‌ను ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒకప్పుడు ఆ పార్టీలోకి జంప్ చేయడానికి ఎర్రబెల్లి ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి. స్థానిక టీఆర్‌ఎస్ నాయకులనుంచి తీవ్రంగా ప్రతిఘటన ఎదురుకావడంతో ఎర్రబెల్లి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లలేకపోయారు. దీనిగురించి పత్రికల్లో వార్తలు వచ్చినా.. అటు టీఆర్‌ఎస్ నుంచిగాని ఇటు టీడీపీనుంచిగాని ఈ విషయంపై స్పందించలేదు. అయితే ఇన్నాళ్లకు టీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈ విషయమై ఎర్రబెల్లిపై ప్రత్యక్ష ఆరోపణలు చేశారు.
టీఆర్‌ఎస్‌లోకి రావడానికి ఎర్రబెల్లి కేసీఆర్‌తో మంతనాలు జరిపారని, అతడే కాకుండా టీడీపీనుంచి పది మంది ఎమ్మెల్యేలను కూడా టీఆర్‌ఎస్‌లోకి తీసుకొస్తానని బేరాలాడినట్లు ఆయన చెప్పారు. ఇప్పుడు మాత్రం వలసలను ప్రొత్సహిస్తున్నారంటూ టీఆర్‌ఎస్‌ను విమర్శిస్తున్న ఆయన.. ఒకప్పుడు తమ పార్టీలోకి ఎందుకు రావాలనుకున్నారో చెప్పాలంటూ విమర్శించారు. ఏడాది కాలంగా టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరికి వారే వెళ్లిపోయారు. తమతోపాటు మరికొందరు ఎమ్మెల్యేలను వారు తీసుకెళ్లడానికి ప్రయత్నించలేదు. కాని ఎర్రబెల్లి మాత్రం మొత్తం టీడీపీనే టీఆర్‌ఎస్‌లో కలిపేందుకు కుట్ర చేసినట్లు పల్లా విమర్శలను బట్టి తెలుస్తోంది. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారో..?