ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంఖుస్థాపనకు ముహుర్తం ఖరారైంది. అందుబాటులో ఉన్న మూడు తేదీల్లో 6నే శంఖుస్థాపన కార్యక్రమం నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. జూన్ 6వ తేదీ ఉదయం 8 గంటల 49 నిమిషాలకు రాజధాని నిర్మాణానికి శంఖుస్థాపన చేయనున్నారు. ఈ కార్యమ్రానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీతోపాటు కేంద్రమంత్రులను ఆహ్వానించాలని ఏపీ సర్కారు నిర్ణయించుకుంది. సాధ్యమైనంత వరకు జాతీయ మీడియా అటెన్షన్ పొందేలా ఏపీ సర్కారు జాగ్రత్తపడుతున్నట్లు సమాచారం. దీనికోసం రాజధాని ప్రాంతంలో భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఈ కార్యమ్రానికి రాజధానికి భూమి ఇవ్వడానికి అంగీకరించని రైతులనుంచి నిరసన సెగలు తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పోలీసులు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదిలావుంటే చంద్రబాబు ఏడాది పాలనకు సంబంధించి జూన్ 8వ తేదీన మంగళగిరిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికోసం పెద్ద ఎత్తున జనాలను సమీకరించాలని ఇప్పటికే పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలకు సమాచారం అందింది. ఈ సమావేశంలో రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం, విభజన ఒప్పందాలు ఉల్లంఘనకు గురవుతున్న తీరు, ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీల గురించి చంద్రబాబు ప్రసంగించనున్నట్లు తెలిసింది.