పార్లమెంట్ కార్యదర్శుల వ్యవహారంలో హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. వెంటనే వారిని తొలగించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దాదాపు ఈ తీర్పు వచ్చి కూడా రెండు వారాలు దాటింది. అయితే ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనబడటం లేదు.
ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో రాజకీయ నిరుద్యోగులు చాలామందే ఉన్నారు. ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కూడా పదవుల ఆశతో పలువురు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఇక రాష్ట్రంలో ఉన్నవి కేవలం 17 మంత్రి పదవులే కావడంతో ఏంచేయాలో దిక్కుతోచక కేసీఆర్ కొత్త పదవులను, దశబ్దాల క్రితమే కనుమరుగైన సంప్రదాయాలను తట్టిలేపారు. అందులోంచి పుట్టుకొచ్చిందే ఈ పార్లమెంట్ సెక్రెటరీల నియామకం. ఆరు మంది టీఆర్‌ఎస్ సభ్యులను కేసీఆర్ పార్లమెంట్ సెక్రెటరీలుగా నియమించారు. అయితే రేవంత్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డిలు దీనిపై హైకోర్టుకు వెళ్లగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పువచ్చింది. పార్లమెంట్ సెక్రెటరీలను వెంటనే తొలగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. అయినా ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించిన ఎలాంటి ఆదేశాలు జారీ కానట్లు సమాచారం. దీంతో ఇప్పటికీ ఆ ఆరుగురు నాయకులు ఎర్రబుగ్గ కారులోనే తిరుగుతున్నారు. దీంతో మరోసారి కోర్టుకు వెళ్లే ఉద్దేశంతో గుత్తా సుఖేందర్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.