దాదాపు 8 రోజులపాటు కొనసాగిన ఆర్టీసీ కార్మికుల సమ్మెతో దాదాపు 100 కోట్ల రూపాయల నష్టంవాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. 43శాతం ఫిట్‌మెంట్ డిమాండ్‌తో సమ్మెలోకి దిగిన కార్మికులకు ఏకంగా 44శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి కేసీఆర్ షాక్‌నిచ్చారు. అయితే అడిగినదానికంటే ఎక్కువ ఇచ్చే ఉద్దేశం ఉన్నప్పుడు సమ్మె 8 రోజులపాటు జరిగినా ఎందుకు పట్టించుకోలేదు..?, ప్రజలు, విద్యార్థులు అష్టకష్టాలపాలైన కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సాధారణంగా విషయం ఎంత సంక్లిష్టంగా మారితే.. ఆ సమస్యను పరిష్కరించిన వారికి అంత కీర్తి దక్కుతుంది. ఇక ఆర్టీసీ కార్మికులు సమ్మె ప్రారంభించగానే 43శాతం ఫిట్‌మెంట్‌కు కేసీఆర్ అంగీకరించి ఉంటే ఈ విషయానికి ఇంత హైప్ దక్కేది కాదు. 8 రోజులపాటు సమ్మె కొనసాగి ఓ ప్రజలు అష్టకష్టాలు పడటం, మరోవైపు మీడియా ఈ సమ్మెను బాగా కవర్ చేయడంతో దీనికి ఎనలేని ప్రాధాన్యత దక్కింది. ఇక 8 రోజులపాటు మౌనంగా ఉన్న కేసీఆర్ చివరిరోజు మేల్కొన్నారు. ఆర్టీసీ కార్మిక నాయకులను చర్చలకు పిలిచి.. మీరండిగింది 43శాతమేగా నేను 44శాతం ఇస్తున్నానంటూ ప్రకటించాడు. దీంతో సమస్య పరిష్కారకర్తగా.. ఊదారస్వభావుడిగా కూడా కేసీఆర్‌కు పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఆయన చిత్రపటానికి లెక్క లేనన్ని పూల దండలు.. క్షీరాభిషేకాలు కొనసాగాయి. అదే ఆర్టీసీ సమ్మె మొదలైన రోజే కేసీఆర్ 44 శాతం ఫిట్‌మెంట్ ఇస్తే ఇవి దక్కేవా అనేది అనుమానమే. అందుకే సమస్యను జఠిలం చేసి పరిష్కారకర్త మరింత పేరును పొందినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.