యావత్ భారత దేశం మోదీ చైనా పర్యటనవైపే చూస్తోంది. గతంలో చైనా దుందుడుకు చర్యలకు గట్టిగా జవాబివ్వడానికి కూడా భారత్ జంకేది. కానీ మోదీ తనదైన శైలిలో స్వరం పెంచారు. అమెరికా ఆధిపత్యాన్నే సవాలు చేస్తున్న చైనాని నిలువరించడం కష్టం అని తెలిసినా వ్యక్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని తాకట్టుపెట్టకుండా ‘చైనా కంట్లో నలకలా’ చాకచక్యంగా మోదీ ఏ మేరకు పావులు కదుపుతారోనని యావత్ భారతం ఆసక్తిగా గమనిస్తోంది. బ్రిక్స్ బ్యాంక్, బంగ్లా - చైనా - భారత్ మయన్మార్ కారిడార్, గనులు ఖనిజ రంగాలలో కుదుర్చుకోనున్న ఒప్పందాలు, భారత్‌లో పెట్టుబడులను సగటు భారతీయుడు పట్టించుకునే స్థితిలో లేడు. 4000 కిలో మీటర్ల సరిహద్దు వివాదం, పాకిస్తాన్‌కు 46 బిలియన్ డాలర్ల ఆర్ధిక తోడ్పాటు, పాక్ - చైనా కారిడార్, పాక్ ఆక్రమిత కాశ్మీరులో ప్రతిపాదిత మౌలిక సదుపాయాల కల్పనకు చైనా శ్రీకారం చుట్టడం భారత్‌ను కలవరపెడుతున్నాయి. ఇండో - చైనా సరిహద్దు వివాదం ఆసియా దశ దిశలను నిర్దేశించనున్నది. ఈ దశాబ్దపు అత్యంత కీలక సమావేశంగా భారత ప్రధాని చైనా పర్యటనని పేర్కొనవచ్చు. మాటలలో చేతలలో హావభావాలలో సెంటిమెంట్‌ని పండిస్తూ భారతీయతని గుబాళించే మోదీ సమ్మోహన శక్తిపై ప్రతికూల పరిస్థితిలోనూ అపార నమ్మకం వుంది. అందుకే ఆశగా ఎదురు చూస్తోంది అఖండ భారత్.