ఏపీ ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రాజధానికి భూములు ఇవ్వడానికి అంగీకరించని రైతులను దారిలోకి తెచ్చుకునేందుకు ప్రభుత్వం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రైతులనుంచి బలవంతంగా ప్రభుత్వం భూమిని లాక్కునే అవకాశం కలుగుతోంది. ఇటీవలే కేంద్రం తెచ్చిన భూసమీకరణ చట్టాన్ని మొట్టమొదటిగా ఉపయోగించిన ఘనత చంద్రబాబు సర్కారే దక్కించుకోనుందని విశ్లేషకులు చెబుతున్నారు. రాజధానికి భూములివ్వడానికి వ్యతిరేకించిన ఉండవల్లి, పెనుమాక రైతులు హైకోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పువచ్చింది. ఇక ఇప్పుడు భూసేకరణ చట్టాన్ని వినియోగించడంతో రైతులకు ఏంచేయాలో దిక్కుతోచడం లేదు.
మరోవైపు భూసేకరణ చట్టాన్ని పవన్‌కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆయన రైతులు ఇష్టంగా ఇస్తేనే భూములు తీసుకోవాలని, భూసేకరణ చట్టాన్ని వినియోగించడానికి వీలు లేదని తేల్చిచెప్పారు. ఇప్పటివరకు దాదాపు 30 వేల ఎకరాల భూమి సేకరించిన ప్రభుత్వం ఇక మిగితా గ్రామాల్లో కూడా భూమిని సమీకరించడానికి భూసేకరణ చట్టాన్ని వినియోగిస్తుంది. ఇక పవన్‌కల్యాన్ హెచ్చరికలను కూడా బేఖాతరు చేస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచిచూడాల్సిందే.