ఈ పది రోజులు భారత్‌లో సెలబ్రెటీలకు బాగా కలిసొచ్చినట్లు కనిపిస్తోంది. అటు సల్మాన్‌ఖాన్, సత్యం రామలింగరాజుకు బెయిల్ దొరకగా.. ఇక జయలలితపై ఉన్న కేసును కూడా పూర్తిగా కొట్టివేశాయి న్యాయస్థానాలు. దీంతో 'అమ్మ' తమిళనాడు సీఎం గద్దెనెక్కుతుందని ఏడీఎంకే నేతలు సంబురాలు చేసుకున్నారు. ఆమె రేపో.. మాపో.. పదవీ స్వీకారం చేయనుందన్న వార్తలు కూడా వెలువడ్డాయి. అయితే ఈ విషయమై జయలలిత మాత్రం స్పందించడం లేదు. సీఎం పీఠం ఎక్కే ముహుర్తాన్ని కూడా ఖరారు చేయడం లేదు.
జయలలిత సీఎం పీఠం ఎక్కపోవడానికి కూడా స్పష్టమైన కారణాలు కనిపిస్తున్నాయి. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతానని ఇప్పటికే సుబ్రమణ్యస్వామి స్పష్టం చేశారు. అంతేకాకుండా కర్ణాటక సర్కారుకు కూడా ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కర్ణాటక హైకోర్టులో జయలలిత ఆస్తులకు సంబంధించి నంబర్లలో తప్పులు దొర్లాయన్న వాదనలు కూడా వినబడ్డాయి. ఈ తరుణంలో ఈమె సీఎం పీఠం ఎక్కగానే.. సుప్రీం కోర్టునుంచి భిన్నమైన తీర్పు వస్తే అప్పుడు పరిస్థితి ఏంటనేది జయలలితకు అర్థం కాకుండా ఉంది. మళ్లీ సీఎం పీఠం దిగి జైలు కెళ్లాలని. అప్పుడు ప్రజల ముందు తాను చులకనవుతానని జయలలిత భావిస్తున్నట్లు సమాచారం. ఇంకా కొన్ని నెలల్లో తమిళనాడులో ముందస్తు ఎన్నికలకు వేళ్లే ఉద్దేశం ఉండటంతో అప్పటి వరకు బండిని ఇలాగే లాగించే ఉద్దేశంలో జయలలిత ఉన్నట్లు తమిళ్ మీడియాలో కథనాలు ప్రచురితమవుతున్నాయి. అప్పుడు సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పునిచ్చినా తనకే అనుకూలంగా మారుతుందని కూడా జయలలిత భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్నికల వరకు కూడా ఆమె సీఎం పీఠానికి దూరంగానే ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.