జయలలిత, సీనియర్ ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు 60, 70వ దశకంలో తెలుగు ప్రజలను ఓ ఊపు ఊపాయి. వారిద్దరి కాంబినేషన్‌లో చిక్కడు.. దొరకడు, అలీబాబా 40 దొంగలు, కథానాయకుడు, దేవుడు చేసిన మనుషులు తదితర సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఆ తర్వాత వారిద్దరూ రాజకీయాల్లోకి వచ్చి అటు జయలలిత తమిళనాడు సీఎంగా ఇటు ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ సీఎంగా పాలనందించారు. ఇక కాకతాళీయంగా ఎన్టీఆర్ తన హయాంలో విడుదల చేసిన ఓ జీఓ ఇప్పుడు జయలలితను జైలు జీవితంనుంచి కాపాడటం గమనార్హం.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరచూ ఏసీబీ అధికారులు ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లపై దాడులు చేసి అక్రమాస్తుల కేసులు నమోదు చేసేవారు. దీంతో ఉద్యోగులు ఎన్టీఆర్‌ను సాయం చేయమని కోరారు. దీనికి స్పందించిన ఎన్టీఆర్ 20శాతం వరకు అధికంగా ఉన్నా అక్రమాస్తుల కింద లెక్కపెట్టవద్దని జీఓ విడుదల చేశారు. ఇప్పుడు ఇదే జీఓ జయలలితను కూడా కాపాడింది. ముఖ్యమంత్రిగా జయలలిత కూడా ప్రభుత్వ ఉద్యోగేనని, ఆమె అక్రమాస్తులు కేవలం 8 శాతం ఉన్నాయని, ఇవి విస్మరించదగినవేనని బెంగళూరు హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో జయలలిత జైలు జీవితాన్ని తప్పించుకొని మరోసారి సీఎం పీఠమెక్కడానికి సిద్ధమవుతున్నారు. ఇలా ఎన్టీఆర్ తన హయాంలో జారీ చేసిన ఓ జీఓను న్యాయమూర్తి ఉదహరిస్తూ జయలలితను అక్రమాస్తుల కేసు నుంచి బయటపడేశాడు.